: 50 కోట్ల కోసం వచ్చిన లుకలుకలు... బెజవాడ ప్రముఖ ఆసుపత్రుల వైద్యుల హవాలా రాకెట్ లో కొత్త కోణం!
విజయవాడలో హెల్ప్, టైమ్ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్లు చలపాటి రవి, మైనేని హేమంత్, టైమ్ ఆసుపత్రి న్యూరాలజిస్టు పువ్వాడ రామకృష్ణలతో బ్రహ్మాజీ మధ్య 50 కోట్ల రూపాయల కోసం ఏర్పడిన వివాదం పెను కలకలం రేపుతోంది. నేరుగా ఈ కేసును సీపీ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షించడంతో పెద్దతలకాయలు ఆందోళన చెందుతున్నాయి. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... జాతక చక్రం ఆధారంగా రంగురాళ్లను విక్రయించే వ్యాపారం చేసే బ్రహ్మాజీకి విజయవాడలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పరిచయాలున్నాయి. ఈ క్రమంలో విదేశాల నుంచి అతి తక్కువ వడ్డీకి డబ్బు తెప్పించి వైద్యులకు అధికవడ్డీకి ఇస్తుండేవాడు. దీనిని ఆసరాగా చేసుకున్న హెల్ప్ ఆసుపత్రి ఎండీ చలపాటి రవి, టైమ్ ఆసుపత్రి ఎండీ మైనేని హేమంత్, న్యూరాలజిస్టు రామకృష్ణలు హవాలా వ్యాపారానికి దిగారు.
ఈ క్రమంలో సింగపూర్, మలేసియా ద్వారా తరలించిన 50 కోట్ల రూపాయల డబ్బును హవాలా మార్గంలో విదేశాల నుంచి రప్పించుకున్నారు. ఈ డబ్బు విషయంలో రవి, హేమంత్, రామకృష్ణలతో బ్రహ్మాజీకి భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. దీంతో రవి, హేమంత్, రామకృష్ణలు టైమ్ ఆసుపత్రికి చెందిన ఇన్నోవా కారులో లోకల్ గూండా సన్నీ, అతని సహచరులు ఏడుగురి సాయంతో బ్రహ్మాజీని కిడ్నాప్ చేసి, ఒక మామిడి తోటకు తీసుకెళ్లారు.
అక్కడ కిడ్నాపర్లంతా మూకుమ్మడిగా బ్రహ్మాజీపై కర్రలతో దాడికి దిగారు. 'హవాలాకు సంబంధించిన రిసీట్ ముక్క నీ దగ్గరుందంట కదా...ఇవ్వు' అని అడగడంతో అలాంటిదేమీ లేదని చెప్పడంతో అతని వద్దనున్న 11 వేల రూపాయలు, 8 ఉంగరాలు తీసుకుని మళ్లీ దాడికి దిగినట్టు బ్రహ్మాజీ తెలిపాడు. అయితే చంపేస్తారన్న భయంతో తన ఇంట్లోని పర్సులో ఆ కాగితం ఉందని చెప్పడంతో... గ్యాంగ్ లీడర్ సన్నీ, సీహెచ్ వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని అతని ఇంటికి పంపాడు.
అయితే తాను రాకుండా విలువైన పేపర్ ఉండే పర్సును అడగడంతో అనుమానం వచ్చిన అతని భార్య ఇన్నోవా కారులో తన ఇంటికి వచ్చిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ కారు ఎవరిది? అని ఆరాతీయడంతో అది టైమ్ ఆసుపత్రి పేరిట రిజిస్టర్ అయినట్టు తేలింది. దీంతో తీగలాగిన పోలీసులకు డొంక కదిలింది. అయితే ఈ కేసులో పటమట సీఐ జాన్ కెన్నడీ, ట్రాఫిక్ ఏసీపీ సూర్యచంద్రరావులకు కూడా భాగమున్నట్టు తెలుస్తోంది. దీంతో వీరిద్దరినీ విధుల నుంచి తప్పించిన సీపీ గౌతమ్ సవాంగ్ వారిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
ఉన్నతాధికారుల హస్తం ఉండడంతో దీని వెనుక రాజకీయ నాయకులు కూడా ఉండవచ్చన్న అనుమానంతో కింది స్థాయి సిబ్బందికి కేసు అప్పగిస్తే, పక్కదారి పట్టే ప్రమాదం ఉందని భావించిన గౌతమ్ సవాంగ్ స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసును నీరుగార్చాలని పలువురు రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బాధితుడు బ్రహ్మాజీతో రాజీకోసం బేరం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు పర్యవేక్షణ గౌతమ్ సవాంగ్ చేతిలో వుందని తెలుసుకుని హెల్ప్, టైమ్ ఆసుపత్రుల ఎండీలు పరారీలో ఉన్నారు. ఇతరులు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు.