: మూడేళ్ల మోదీ పాలనపై 2 లక్షల మందిని భాగం చేస్తూ నిర్వహించిన సర్వే ఫలితాలివి!
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికార పగ్గాలను చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో 2 లక్షల మంది ప్రజలను భాగం చేస్తూ, 'లోకల్ సర్కిల్స్ సిటిజన్స్ ఎంగేజ్ మెంట్ ప్లాట్ ఫాం' ఓ సర్వేను నిర్వహించి, ఆసక్తికర అంశాలను వెల్లడించింది. 61 శాతం మంది మోదీ పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నారని సర్వేలో వెల్లడైందని తెలిపింది. ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలను వచ్చే రెండేళ్లలో కేంద్రం నెరవేరుస్తుందన్న నమ్మకం తమకుందని 59 శాతం మంది పేర్కొన్నారు.
అంచనాలకు తగ్గట్టుగా ప్రభుత్వ పనితీరు లేదని 39 శాతం మంది పేర్కొన్నారు. గత సంవత్సరం 36 శాతం మంది మోదీ పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేయగా, ఈ సంవత్సరం ఆ సంఖ్య మరో 3 శాతం పెరిగింది. పార్లమెంటు సభల నిర్వహణలో తొలి రెండు సంవత్సరాల్లో కంటే, మూడో సంవత్సరం మోదీ సర్కారు విజయవంతమైందని 65 శాతం మంది వ్యాఖ్యానించారు. జీఎస్టీ వంటి కీలక బిల్లుల అమలుకు కేంద్ర వ్యూహాలు ఫలించాయని చెప్పారు. ఇదే సమయంలో ఎంపీలు ఎవరూ నియోజకవర్గాలకు సక్రమంగా రావడం లేదని, క్షేత్ర స్థాయిలో అభివృద్ధి కుంటుపడిందని 69 శాతం మంది పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, జీవన వ్యయం పెరిగిపోయాయని 66 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ఇక మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల సంఖ్య ఎంతమాత్రమూ తగ్గలేదని 60 శాతం మంది పేర్కొన్నారు. భద్రతపై మరిన్ని చర్యలు తీసుకోవాల్సి వుందని తెలిపారు. 'స్వచ్ఛ సర్వేక్షణ్ 2017' నివేదికలో 80 శాతం మంది ప్రజలు తమ నగరాలు పరిశుభ్రంగా ఉన్నాయని భావిస్తున్నట్టు వెల్లడించగా, సర్వేలో పాల్గొన్న వారిలో 35 శాతం మంది మాత్రమే దాన్ని అంగీకరించారు. గడచిన మూడు సంవత్సరాల్లో దేశంలో అవినీతి తగ్గిందని 47 శాతం మంది పేర్కొనగా, అన్ని రంగాల విభాగాల్లోను తీసుకుంటున్న వారు ఉన్నారని 43 శాతం మంది తెలిపారు. నోట్ల రద్దు తరువాత లంచగొండితనం తగ్గిందా? అన్న ప్రశ్నకు 39 శాతం మంది అవునని తెలిపారు. నల్లధనాన్ని నియంత్రించగలిగారా? అన్న ప్రశ్నకు 51 శాతం మంది పాజిటివ్ గా సమాధానమిచ్చారు.
కాగా, తొలి సంవత్సరం ఇదే సర్వేలో 68 శాతం మంది, రెండో సంవత్సరంలో 64 శాతం మంది ప్రజలు మోదీ పాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేయగా, ఈ సంవత్సరం మరో 3 శాతం తగ్గడం గమనార్హం.