: ప్రకృతి విపత్తులను ముందుగానే తెలుసుకునే విషయంలో ఏపీ ముందడుగు!
ప్రకృతి విపత్తులను ముందుగానే తెలుసుకునే విషయంలో ఏపీ ముందడుగు వేసింది. టెక్నాలజీతో పిడుగుపాటు హెచ్చరికలను ముందుగానే విపత్తు నిర్వహణ శాఖ పసిగట్టింది. చిత్తూరు జిల్లాలో కుప్పం మండలంలో పిడుగుపాటుపై అరగంట ముందుగానే హెచ్చరించడమే ఇందుకు నిదర్శనం. హెచ్చరించిన విధంగానే కుప్పం మండలంలో రెండు చోట్లు పిడుగులు పడ్డాయి. పిడుగు ఎక్కడపడుతుందో తెలిపే సాంకేతికతను విపత్తు నిర్వహణ శాఖ సమకూర్చుకుంది.
ఈ మేరకు అమెరికాకు చెందిన ఎర్త్ నెట్ వర్క్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. పిడుగుపడే అవకాశం ఉన్న ప్రాంతంలోని సెల్ టవర్ల నుంచి అరగంట ముందే హెచ్చరికలు వెలువడతాయి. వాయిస్ మెసేజ్ ల రూపంలో సమీప ప్రాంతాల వాసులకు హెచ్చరికలు జారీ అవుతాయి. కాగా, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 15 కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా విపత్తుల నిర్వహణ శాఖ పరిశీలిస్తోంది. నెల రోజుల్లోగా రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు పిడుగుపాటుకు సంబంధించిన సూచనలను ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.