: మీ కుమార్తెలను కాపాడుకోండి..మీ అబ్బాయిలను ఓ కంట కనిపెట్టండి: కిరణ్ బేడీ
‘మీ కుమార్తెలను కాపాడుకోండి.. మీ అబ్బాయిలను ఓ కంట కనిపెట్టండి’ అంటూ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ సలహా ఇచ్చారు. హర్యానాలోని రోహ్ తక్ లో ఓ యువతిపై అత్యాచార ఘటనపై ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆడపిల్లల సంరక్షణ, మగపిల్లలు పెరిగే విధానంపై తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు. మగ పిల్లలను సమాజానికి ఆస్తిగా ఇస్తారా? లేక సమాజానికి కీడు చేసే వ్యక్తిగా తయారు చేస్తారా? అనేది తల్లిదండ్రులు నిర్ణయించు కోవాలన్నారు.
మంచి నడవడిక వాళ్లకు నేర్పించినప్పుడే వాళ్లు సమాజానికి ఆస్తిగా తయారవుతారన్నారు. అమ్మాయిలు వద్దు, అబ్బాయిలే కావాలని కోరుకుంటున్న తల్లిదండ్రులు, వాళ్లు ఎలా ఎదుగుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారనేది ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలన్నారు. ‘ఆడపిల్లలను రక్షిద్దాం.. ఆడపిల్లలను చదివిద్దాం’ అనే నినాదాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని, అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ‘మీ కుమార్తెలను కాపాడుకోండి’ అనే నినాదాన్ని అమలు పరచాలని కిరణ్ బేడీ అన్నారు.