: మారువేషాల్లో వెళ్లి ‘బాహుబలి-2’ పైరసీ నిందితులను పట్టుకున్నాం: డీసీపీ అవినాష్ మహంతి
‘బాహుబలి-2’ సినిమాను పైరసీ చేసిన నిందితులను పాట్నా నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చారు. ఈ రోజు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీసీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ, ‘బాహుబలి-2’ చిత్ర నిర్మాతల ఫిర్యాదు మేరకు ఈ కేసు దర్యాప్తులో భాగంగా మారు వేషాల్లో పాట్నాకు వెళ్లి పైరసీ గ్యాంగ్ కదలికలను గమనించి, వారిని పట్టుకున్నామన్నారు. ఈ గ్యాంగ్ కు చెందిన రాహుల్ మెహతా, జితేందర్ మెహతా, తౌఫిక్, ఎండీ అలీ, దివాకర్ కుమార్, చందన్, మోను అనే నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. శాటిలైట్ ద్వారా ‘బాహుబలి-2’ హెచ్ డీ ప్రింట్ ను ఈ గ్యాంగ్ కాపీ చేసి, పైరసీకి పాల్పడుతోందన్నారు. నిందితుల నుంచి పైరసీ సీడీలను, ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.