: యూపీ అసెంబ్లీలోకి దూసుకెళ్లి నిరసన తెలిపిన కాంట్రాక్టు ఉద్యోగిని
నిన్న ప్రారంభమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనతో దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచాయి. తాజాగా ఆ అసెంబ్లీ ఆవరణలోని శాసన మండలిలో అలజడి చెలరేగింది. శాసనమండలి సమావేశాలు జరుగుతుండగా, ఓ మహిళ చైర్మన్ పోడియంవైపు పరిగెత్తుకుంటూ వచ్చింది. దీంతో సమావేశాలు కాసేపు ఆగిపోయాయి. మార్షల్స్ ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారి నుంచి తప్పించుకున్న ఆ మహిళ కాసేపు శాసనమండలిలోనే ఉంది. కొద్దిసేపటి తర్వాత అతికష్టం మీద ఆమెను బయటికి ఈడ్చుకొచ్చారు.
ఆ మహిళ కాంట్రాక్టు పద్ధతిలో అసెంబ్లీలో క్లాస్-4 ఉద్యోగినిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. రాష్ట్ర సర్కారు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ, ఆమె ఇలా దూసుకొచ్చి, నిరసన తెలిపింది. ఓ మహిళ ఇలా ఏకంగా ఛైర్మన్ పోడియం వద్దకు దూసుకురావడం పట్ల ఆ రాష్ట్ర శాసనసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో భద్రత పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు.