: బాహుబలి-2’కు వస్తున్న ఆదరణ సరైనదే: హీరో అక్షయ్ కుమార్
‘బాహుబలి-2’పై సినీ రంగ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖుల ప్రశంసల వర్షం కొనసాగుతూనే ఉంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ దర్శకులు ‘బాహుబలి-2’ను తెరకెక్కించిన తీరుపై రాజమౌళిని అభినందించడం తెలిసిందే. అయితే, బాలీవుడ్ హీరోలు మాత్రం ఈ చిత్రంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ తాజాగా స్పందిస్తూ ఓ ట్వీట్ చేశాడు. ఎట్టకేలకు ‘బాహుబలి-2’ చూశానని, ఈ సినిమాకు వస్తున్న ఆదరణ సరైనదేనని అన్నారు. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ‘బాహుబలి-2’ చిత్ర యూనిట్ కు అక్షయ్ తన శుభాకాంక్షలు తెలిపాడు. కాగా, మరో బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించాడు. అందుకు, స్పందించిన రాజమౌళి ‘థ్యాంక్యూ సోమచ్ రణ్ వీర్’ అని తిరిగి ట్వీట్ చేశారు.