: కామెడీ షోలు జబర్దస్త్, పటాస్ ల పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
తెలుగు పాప్యులర్ టీవీ కార్యక్రమాలు జబర్దస్త్, పటాస్‌లపై పలు అభ్యంతరాలు చెబుతూ హైదరాబాద్‌లోని బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో సెన్సార్ బోర్డు సభ్యుడు నందనం దివాకర్ ఫిర్యాదు చేశారు. ఆ కార్యక్రమాల్లో పంచ్‌లు, సెటైర్ల కోసం వాడుతున్న పదజాలం బాగోలేదని ఆయన పేర్కొన్నారు. ఆ రెండు ప్రోగ్రాంలు యువతను పెడదోవ పట్టిస్తున్నాయని తెలిపారు. ఈ రెండు ప్రోగ్రాంలలోని కొన్ని ఎపిసోడ్‌లలో అశ్లీల, అనైతిక దృశ్యాలు కూడా ఉంటున్నాయని ఆయన చెప్పారు.
మరోవైపు ఎమ్మెల్యే రోజా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి జబర్దస్త్ ప్రోగ్రాంలో మహిళలను, చిన్న పిల్లలను కించపరిచే కార్యక్రమాలను ప్రోత్సహించడం బాధాకరమని ఆయన అన్నారు. ఆయా ప్రోగ్రాంలలో ఎదుటి వ్యక్తిని పంచ్‌ల పేరుతో తిడుతున్నారని, ఆ డైలాగులు విని ప్రేక్షకులు నవ్వుకుని ఆనందించే స్థాయికి దిగజారిపోవడమేంటని, ఒకరిని తిడుతోంటే మరొకరు ఆనందించడమేంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.