: ఇంద్రాణి, పీటర్ ముఖర్జియా కేసులో భాగంగా చిదంబరం కుమారుడు కార్తి ఇళ్లలో సోదాలు
కేంద్ర మాజీ ఆర్థిక, హోం మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఇల్లు సహా 14 ప్రాంతాల్లో సీబీఐ ఈ ఉదయం నుంచి సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమ కుమార్తె షీనా బోరా హత్య కేసులో ఇరుక్కుని జైల్లో గడుపుతున్న ఇంద్రాణి ముఖర్జియా, ఆమె భర్త పీటర్ ముఖర్జియాలు నిర్వహించిన మీడియా కంపెనీకి లబ్ది చేకూర్చారన్న విషయమై సోదాలు జరుగుతున్నాయి. కార్తీ చిదంబరం సంస్థ 2008లో లంచాలు తీసుకుని ఐఎన్ఎక్స్ మీడియాకు కేంద్రం నుంచి అనుమతులు ఇప్పించినట్టు సీబీఐ వర్గాలు గుర్తించి మరింత సమాచారం కోసం సోదాలకు దిగింది.
ఐఎన్ఎక్స్ మీడియా ఎఫ్ఐపీబీ (ఫారిన్ ఎక్స్ఛేంజ్ ప్రమోషన్ బోర్డు) నుంచి రూ. 4 కోట్ల నిధుల సమీకరణకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇప్పించేందుకు కార్తీ చిదంబరం సంస్థ రూ. 10 లక్షలు లంచం తీసుకుందని, ఆపై ఐఎన్ఎక్స్ మీడియా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి రూ. 305 కోట్లను సమీకరించిందని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఈ డీల్స్ కుదిరినప్పుడు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నారని, ఆయన పాత్ర ఏమైనా ఉందా? అన్న కోణంలోనూ దర్యాఫ్తు జరుగుతుందని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.