: నా దేవుడు రజనీకాంత్.. డబ్బును అలా ఖర్చుపెట్టవద్దని మందలించారు: డైహార్డ్ ఫ్యాన్ భావోద్వేగం
తమిళనాడులో రజనీకాంత్ కోసం ప్రాణాలను సైతం ధారపోసే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి డై హార్డ్ ఫ్యాన్ ఒకరు రజనీకాంత్ ను కలిసేందుకు లక్షన్నర ఖర్చు చేశాడంటే ఆశ్చర్యం అనిపించకమానదు. ఆ ఘటన, అభిమాని వివరాల్లోకి వెళ్తే... తమిళనాడుకు చెందిన జయశీలన్ అనే వ్యక్తి రజనీకి డైహార్డ్ ఫ్యాన్. రజనీని కలవాలని, అతనితో ఫొటో దిగాలని కోరుకునే చాలా మంది అభిమానుల్లో ఆయన ఒకరు.
అయితే 'లింగా' సినిమా షూటింగ్ కోసం రజనీ విదేశాలకు వెళ్తున్నారని ఎయిర్ పోర్టులో ఉన్న జయశీలన్ కు తెలిసింది. వెంటనే ఆయనను కలిసే ప్రయత్నం చేశాడు. సెక్యూరిటీ కారణాల వల్ల సాధ్యపడలేదు. దీంతో తానొక్కడ్నే కలిస్తే కిక్కేముందని భావించి, తన కుటుంబం మొత్తాన్ని రజనీ వెళ్తున్న ప్రదేశానికి, అతను వెళ్తున్న ఫ్లైట్ లోనే తీసుకెళ్లాడు. దీని కోసం లక్షన్నర ఖర్చు చేసి టికెట్లు కొనేశాడు. ఈ విషయం తెలిసిన రజనీకాంత్ భావోద్వేగానికి గురయ్యారు. జయశీలన్ కుటుంబంతో సుమారు 20 నిమిషాలు గడిపారు. ఆయన కుమార్తెను రజనీ తన ఒళ్లో కూర్చోబెట్టుకున్నారు. వారి కుటుంబంతో ఫొటో దిగారు. జయశీలన్ భార్య కళ్లజోడుపై ఆటోగ్రాఫ్ అడిగితే సరే అని సంతకం పెట్టారు. ఇప్పటికీ ఆ కళ్లద్దాలను ఎవరినీ ముట్టుకోనివ్వరట. ఈ సందర్భంగా తమ దేవుడు రజనీ తమతో మాట్లాడుతూ, డబ్బును ఇలాంటి చిన్నిచిన్న విషయాలపై కాకుండా, కుటుంబానికి ఖర్చుచేయాలని సూచించారని తెలిపాడు.