: రజనీకాంత్ భవనంపై పూరిగుడిసె ఎందుకుంటుందో తెలుసా?: అభిమానులను అడిగిన ప్రముఖ దర్శకుడు
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నివాస భవనంపై ఒక పూరి గుడిసె ఉంటుందని, అది ఎందుకు ఉంటుందో ఎవరికైనా తెలుసా? అని ప్రముఖ దర్శకుడు ఎస్పీ ముత్తురామన్ చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలోని అభిమానులను ప్రశ్నించారు. తర్వాత దానికి సమాధానం ఆయనే చెబుతూ, రజనీకాంత్ నిరాడంబరతకు అది నిదర్శనమని అన్నారు. తామిద్దరం కలిసిన మొదటిరోజు ఆయన తనతో ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారని ఆయన చెప్పారు. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ, ఫిలిం ఇనిస్టిట్యూట్ లో చదువుతున్న సమయంలో చెన్నైలో కొంతమంది స్నేహితులతో కలిసి ఆయన ఒక గుడిసెలో ఉండేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఇంత ఎదిగినా ఆయన దానిని మర్చిపోలేదని, అందుకే ఇప్పుడు ఆయన భవంతి పైన అలాంటి గుడిసె ఒకటి కట్టించారని అన్నారు. 'రజనీ, ఇలా ఎందుకు చేస్తున్నావు?' అనడిగితే... మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది ఎప్పుడూ మర్చిపోకూడదని రజనీకాంత్ సమాధానమిచ్చారని ఆయన తెలిపారు. అంత విశిష్ట వ్యక్తిత్వం రజనీకాంత్ దని ఆయన తెలిపారు. రజనీకాంత్ సాయం చేయరని కొంతమంది ఆరోపిస్తుంటారని, ఆయన ఎప్పుడు, ఎవరికి, ఎలా ఇవ్వాలో తెలుసని, ఆయన అలా చేస్తుంటారని ఆయన చెప్పారు. ఈ విషయం సినీపరిశ్రమలో చాలా మందికి తెలుసని ఆయన చెప్పారు.