: విడ్డూరం!.. ఇందిరాపార్కు నిరసనలో ప్లకార్డులు ప్రదర్శించిన సీఐ, 20 మంది కానిస్టేబుళ్లు!
విడ్డూరమంటే ఇదేనేమో! ధర్నాచౌక్‌ను తరలించాలంటూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో స్వయంగా సీఐ సహా కానిస్టేబుళ్లు ప్లకార్డులు పట్టుకుని బస్తీవాసులకు మద్దుతు పలుకుతూ కనిపించారు. ధర్నాచౌక్ కొనసాగించాల్సిందేనంటూ అఖిలపక్ష, ప్రజాసంఘాలు, తరలించాలంటూ స్థానిక కాలనీవాసులు, అధికార టీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా నిర్వహించిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పరస్పర దాడులతో ‘ఆక్యుపై ధర్నాచౌక్’ ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. కుర్చీలు ధ్వంసం చేశారు. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
దీంతో నిరసన కార్యక్రమం కాస్తా హింసాత్మకంగా మారింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, నిరసన కార్యక్రమంలో లేక్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీదేవి సివిల్ డ్రెస్‌తో ప్లకార్డులు పట్టుకుని ధర్నాలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. మరో 20 మంది మహిళా కానిస్టేబుళ్లు కూడా నిరసనలో పాల్గొన్నారు. వారు మీడియా దృష్టిలో పడడంతో కెమెరామెన్లు కెమెరాలకు పనిచెప్పారు. దీనిని గమనించిన శ్రీదేవి, కానిస్టేబుళ్లు చల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. విషయం తెలిసిన అఖిలపక్ష నేతలు పోలీసులపై మండిపడ్డారు. స్వయంగా పోలీసులే బస్తీవాసులను రెట్టగొట్టడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.