: జగన్ మగాడిలా వెళ్లి ప్రధాని మోదీని కలిశారు: ఎమ్మెల్యే రోజా
ప్రధాని నరేంద్రమోదీని వైఎస్సార్సీపీ అధినేత జగన్ కలవడంపై టీడీపీ నేతలు విమర్శలు చేయడాన్ని ఎమ్మెల్యే రోజా ఖండించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీని కలిసేందుకు వెళ్లిన జగన్ మగాడిలా ప్రెస్ ను వెంటబెట్టుకుని మరీ వెళ్లారని అన్నారు. ఈ రాష్ట్ర ప్రజల గురించి, ఇక్కడ జరుగుతున్న దోపిడీ గురించి మోదీతో జగన్ డిస్కస్ చేశారని అన్నారు. ప్రధానికి ఇచ్చిన వినతిపత్రాన్ని మీడియాకు ఇచ్చారని, అక్కడ ఏం మాట్లాడింది జగన్ చెప్పారని అన్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై ఆమె ఆరోపణలు గుప్పించారు. అమెరికా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు విరాళాల పేరిట ఎంత దోచుకున్నారో లెక్క చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్లేటప్పుడు మూడు వందల కంపెనీల సీఈవోలను కలుస్తానని ఎంతో గొప్పగా చెప్పారని, అయితే, రెండు వందల కంపెనీల సీఈవోలు చంద్రబాబు అవినీతి గురించి తెలుసుకుని ఆయన్ని కలవడానికి భయపడ్డారని ఆరోపించారు.