: జగన్ టీడీపీకి మద్దతిస్తానంటే ఆలోచిస్తాం: మంత్రి సోమిరెడ్డి
కేంద్రంలో ఉన్న ఎన్డీయేకు జగన్ మద్దతు పలుకుతూ, భాగస్వామ్య పార్టీగా ఉన్న తెలుగుదేశంకు కూడా సపోర్ట్ ఇస్తానని జగన్ ముందుకు వస్తే ఆలోచిస్తామని, అయితే అంతకన్నా ముందు తనపై ఉన్న కేసుల్లో నిర్దోషిగా నిరూపించుకోవాలని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రధానితో జగన్ భేటీ కావడంపై తమకేమీ అభ్యంతరాలు లేవని చెప్పారు.
మోదీని కలిసిన జగన్, తాను ప్రజా సమస్యలను ప్రస్తావించానని బయటకు చెప్పి, అక్కడ రాజకీయాలు మాట్లాడి వచ్చారని ఆరోపించారు. మిర్చి రైతుల సమస్యలపై అసెంబ్లీని అడ్డుకుంటానని చెప్పిన జగన్, ప్రధాని ముందు రైతుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని, ఈ విషయంలో వైకాపా తన స్పందనను తెలియజేయాలని డిమాండ్ చేశారు. అవినీతిపరుల విషయంలో మోదీ చండశాసనుడని, ఆయన కాళ్లు మొక్కినా కనికరం లభించే పరిస్థితి లేదని సోమిరెడ్డి అన్నారు.