: నేను రాజకీయాల్లోకి వస్తే...!: రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు
ఎంపిక చేసిన అభిమాన సంఘాల నాయకులతో తలైవా రజనీకాంత్ సమావేశం ఉత్సాహంగా సాగుతోంది. అభిమానులను ఉద్దేశించి ప్రసంగించిన రజనీ, తనపై చూపిస్తున్న ఇంతటి ఆదరణను జీవితాంతమూ మరచిపోబోనని చెప్పారు. తాను రాజకీయాల్లోకి రావాలని ఎంతో కాలం నుంచి అభిమానులు డిమాండ్ చేస్తున్నారని, వారు అలా కోరడంలో తప్పులేదని అన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తే డబ్బు ఆశ ఉన్నవారిని దగ్గర చేర్చుకునే సమస్యే లేదని స్పష్టం చేశారు.
తాను ఎవరికీ భయపడేది లేదని అన్నారు. భయం అన్నది తనలో, తన అభిమానుల్లో ఏ మాత్రం కనిపించదని చెప్పారు. ప్రత్యేకంగా రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఆయన చెప్పకపోయినా, రజనీ ప్రసంగం రాజకీయాల ప్రస్తావనతోనే మొదలైంది. ఇక ఈ నెల 20 నుంచి తన కొత్త సినిమా మొదలవుతుందని ఆయన తెలిపారు. తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతానని, తనతో ఫోటో వారికి ఎంత ఆనందాన్ని అందిస్తుందో, తనకు అంతకన్నా ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుందని ఆయన అన్నప్పుడు అభిమానులు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు.