: ప్రయాణికులను ఆకట్టుకునేందుకు రైల్వే కొత్త ప్లాన్.. ప్రయాణిస్తూనే సినిమాలు, సీరియళ్లు చూసే అవకాశం!
ప్రీమియం రైళ్లు రాజధాని, శతాబ్ది, దురంతో, హమ్‌సఫర్‌లలో ప్రయాణించే వారికి శుభవార్త. ఇక నుంచి ఈ రైళ్లలో ప్రయాణిస్తూనే నచ్చిన సినిమాలు, టీవీ సీరియళ్లు చూసేయవచ్చు. ఇందుకు సంబంధించిన ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో రైల్వే తలమునకలై ఉంది. ఇది అందుబాటులోకి వస్తే ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర పరికరాల్లో తమకు నచ్చిన సినిమాలను చూసుకోవచ్చు. ఇందుకోసం ప్రయాణికులు కొంత చెల్లించాల్సి ఉంటుంది.
ఒక రైలులో ఇటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు రైల్వేకు రూ.25 లక్షల వరకు అవుతుంది. కంటెంట్ ఆన్ డిమాండ్ విధానంలో ప్రయాణికులకు ఈ సేవలు అందనున్నట్టు సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. అయితే తొలుత ప్రీమియం రైళ్లలోనే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని, క్రమంగా దీనిని మిగతా రైళ్లకు విస్తరిస్తామని పేర్కొన్నారు. హాలీవుడ్, బాలీవుడ్, ప్రాంతీయ సినిమాలతోపాటు టీవీ సీరియళ్లను కూడా చూసే వెసులుబాటు కూడా ప్రయాణికులకు కలుగుతుందని ఆయన వివరించారు.