: నరేంద్ర మోదీ తన పేరును ప్రస్తావించడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న ముత్తయ్య మురళీధరన్
ఇటీవలి తన శ్రీలంక పర్యటనలో భాగంగా, ఓ సభలో ప్రసంగిస్తూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ తన పేరును ప్రస్తావించడంపై స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. టెస్టులు, వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును తన పేరున లిఖించుకున్న ముత్తయ్య పేరును భారత్, శ్రీలంక తమిళుల ప్రజల మధ్య ఉన్న సంబంధాలపై మాట్లాడుతూ, ప్రధాని గుర్తు చేసుకున్నారు. తమిళులు మురళీధరన్, ఎంజీఆర్ వంటి వారిని ప్రపంచానికి బహుమతిగా ఇచ్చారని అన్నారు.
ఇక మోదీ నోటి వెంట తన పేరు రావడం తనకు సంభ్రమాశ్చర్యాలను కలిగించిందని, తనకు దక్కిన అతిపెద్ద గౌరవాల్లో ఇది ఒకటని ముత్తయ్య అన్నాడు. ఇండియాతో తనకెంతో దగ్గరి బంధముందని, చెన్నైకి చెందిన మధుమలర్ రామమూర్తిని తాను వివాహం చేసుకున్నానని ఈ సందర్భంగా మురళీధరన్ చెప్పాడు. తన పూర్వీకులు ఇండియా నుంచే లంకకు వచ్చారని, ఇప్పుడు తాను ఐదవ తరం వాడినని చెప్పాడు. శ్రీలంకకు ఇండియా ఎప్పుడూ పెద్దన్న వంటిదని అన్నాడు.