: ప్రజల నిరసనతో భువనగిరిలో ఆగిపోయిన మహేశ్ 'స్పైడర్' షూటింగ్
నిన్నటి నుంచి భువనగిరి నిమ్స్ భవన సముదాయంలో జరగాల్సిన ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం స్పైడర్ షూటింగ్ ప్రజల నిరసన కారణంగా అర్థాంతరంగా ఆగిపోయింది. ఈ భవనంలో వైద్య సేవలు ప్రారంభించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ, వైద్య సేవల కోసం తాము ఎదురుచూస్తుంటే, భవనాన్ని సినిమా షూటింగ్ కు అద్దెకివ్వడాన్ని ప్రజలు వ్యతిరేకించారు. యువ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జిట్టా బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో పలువురు నిమ్స్ భవనానికి వచ్చి, ఎట్టి పరిస్థితుల్లోనూ షూటింగ్ జరపడానికి వీల్లేదని హెచ్చరించారు. దీంతో నిమ్స్ డైరెక్టర్ మనోహర్ స్పందించి, షూటింగ్ అనుమతులను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ఇక చేసేదేమీ లేక తాము తెచ్చుకున్న షూటింగ్ సామాగ్రిని తీసుకుని యూనిట్ వెనక్కెళ్లిపోయింది.