: భారత్ లో విద్యుత్ రంగాన్ని మార్చబోతున్నాం: తన అమెరికా పర్యటన ముఖ్యాంశాలు వెల్లడించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అమెరికా పర్యటన వివరాలను ఈ రోజు సాయంత్రం వెల్లడించారు. వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అమెరికాలో మెజారిటీ హోటళ్లు గుజరాత్ వాళ్లవే ఉన్నాయని, తెలుగు రాష్ట్రాల నుంచి ఇంజనీర్లు, డాక్టర్లు అధికంగా అమెరికా వెళ్లారని అన్నారు. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి నలుగురు ఐటీ ఉద్యోగుల్లో ఒకరు ఇండియన్ ఉద్యోగేనని చెప్పారు. గతంలో వారసత్వంగా వచ్చిన ఆస్తులే సంపదగా ఉండేవి, కానీ ప్రస్తుతం తెలివితేటలు ఉన్నవారే సంపద కలిగిన వారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో సాంకేతిక అభివృద్ధిపై ఎక్కువగా దృష్టిసారిస్తామని చెప్పారు.
ఏపీని నాలెడ్జ్ హబ్ గా తయారు చేస్తామని చంద్రబాబు చెప్పారు. అమెరికాలో ఎక్కువ ఆదాయం ఆర్జిస్తోన్న విదేశీయుల్లో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారని చెప్పారు. తాను ఏపీలో సంపద సృష్టించడానికే అమెరికా వెళ్లానని చెప్పారు. ప్రస్తుతం డ్రైవర్ లెస్ ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయని, రాబోయే కాలం ఎలక్ట్రిక్ వాహనాలదేనని చెప్పారు. తన పర్యటనలో సోలార్, పవన విద్యుత్ పై దృష్టి పెట్టానని, తెలిపారు. అమెరికాలో అన్ని తెలుగు సంఘాల వారితో మాట్లాడానని చెప్పారు. రాష్ట్రంలో వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని అన్నారు. స్టార్టప్ కంపెనీలు సిలికాన్ వ్యాలీలోనే ఎక్కువగా ఉన్నాయని, ఆ ప్రాంత పర్యటనలో పలు అంశాలపై చర్చించానని అన్నారు.
భవిష్యత్తులో ఓ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా ఇండియా తయారుకానుందని, అందులో ఏపీ ముందుండాలని అన్నారు. భారత్ లో సోలార్ స్టోరేజ్‌కు త్వరలోనే శ్రీకారం చుడుతున్నారని చెప్పారు. వ్యవసాయ పంప్ సెట్స్‌కి సోలార్ పవర్ అందిస్తారని అన్నారు. తాను ఈ అంశాలపై అమెరికాలో పలు కీలక ఒప్పందాలు చేసుకున్నానని చెప్పారు. రాష్ట్రంలో 20 శాతం వర్షాభావం ఉన్నప్పటికీ 14 శాతం వృద్ధిరేటుని సాధించామని చెప్పారు. ఇళ్లపై సోలార్ పవర్ ప్యానళ్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తామని అన్నారు. సోలార్ ఎనర్జీ స్టోరేజ్ కు తన అమెరికా పర్యటన దోహదపడిందని తెలిపారు.
భారత్ లో విద్యుత్ రంగాన్ని మార్చబోతున్నామని చంద్రబాబు చెప్పారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించి ప్రపంచానికే భారత దేశం ఆదర్శంగా నిలవాలన్నదే తన తపన అని ఆయన అన్నారు. ఈ అంశంపై అమెరికాలో చర్చించినట్లు తెలిపారు. ఈ సారి చేసిన అమెరికా పర్యటన తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, ఎన్నోసార్లు ఎన్నో దేశాలు తిరిగాను కానీ, ఈ సారి చేసిన పర్యటన ఎంతో తృప్తినిచ్చిందని అన్నారు. తన అమెరికా పర్యటనలో చాలా సమయం వ్యవసాయంపైనే చర్చలు జరిపానని చెప్పారు. వ్యవసాయంలో వినూత్నమైన ప్రయోగాలను చేయనున్నామని తెలిపారు.