: మిగిలింది ఒక్క మ్యాచ్... ఇంకా వారమే ఐపీఎల్
ఐపీఎల్ ఛాంపియన్ ను తేల్చాల్సిన తొలి దశ మ్యాచ్ లలో అన్ని జట్లు ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంది. రేపటితో ఐపీఎల్-2017 లీగ్ తొలిదశ పోటీలు ముగియనున్నాయి. అనంతరం నాకౌట్ మ్యాచ్ లు జరుగుతాయి. వచ్చే వారాంతానికి జరగనున్న ఫైనల్ మ్యాచ్ తో ఐపీఎల్ విజేత ఎవరో తేలిపోతుంది. పాయింట్ల పట్టిక ప్రకారం ప్రస్తుతానికి 13 మ్యాచ్ లు ఆడిన ఐపీఎల్ జట్లలో నాకౌట్ కు ముంబై ఇండియన్స్ (18), కోల్ కతా నైట్ రైడర్స్ (16), పూణే సూపర్ జెయింట్స్ (16), సన్ రైజర్స్ హైదరాబాదు (15) కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (14) జట్లు పోటీ పడుతున్నాయి. ఇందులో ఇప్పటి వరకు పాయింట్ల పరంగా తొలి నాలుగు జట్లు నాకౌట్ కు పోటీ పడతాయి.
దీంతో నేడు, రేపు జరగనున్న మ్యాచ్ లతో హైదరాబాదు, లేదా పంజాబ్ జట్లలో ఏది నాకౌట్ కు వెళ్తుందనేది తేలిపోనుంది. హైదరాబాదు ఖాతాలో 15 పాయింట్లు ఉండడంతో తరువాత మ్యాచ్ లో ఓటమిపాలైతే... పంజాబ్ కూడా ఓటమిపాలుకావాల్సి ఉంటుంది. అదే హైదరాబాదు విజయం సాధిస్తే పంజాబ్ ఫలితంతో సంబంధం లేకుండా నాకౌట్ లో ఆడుతుంది. అప్పుడు తరువాతి మ్యాచ్ లో పూణే కూడా ఓటమిపాలైతే...రన్ రేట్ ఆధారంగా ఆ రెండు జట్లలో ఏది నాకౌట్ చేరుతుందో తేలనుంది. అలా కాకుండా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓటమిపాలైతే...ప్రస్తుతమున్న పాయింట్ల పట్టికతో ఎలాంటి సంబంధం లేకుండా ముంబై, కోల్ కతా, పూణే, హైదరాబాదు జట్లు నాకౌట్ దశలో ఆడనున్నాయి.