: నాకు సోషల్ మీడియా అంటే గౌరవం ఉంది...దానిని పోగొట్టవద్దు: జబర్దస్త్ వినోద్ (వినోదిని)
చిన్న విషయాలను సోషల్ మీడియా పెద్దపెద్ద వివాదాలు చేస్తుందని టెలివిజన్ కామెడీ షో జబర్దస్త్ ఫేమ్ వినోద్ అలియాస్ వినోదిని తెలిపాడు. సోషల్ మీడియాలో ప్రచార హోరు నేపథ్యంలో ఓ టీవీ ఛానెల్ తో వినోద్ మాట్లాడుతూ, ఈ నెల 8న తనకు ఒంట్లో బాగోలేదని కుటుంబ సభ్యులు చర్చ్ కు తనను ప్రత్యేక ప్రార్థనలకు తీసుకెెళ్లారని చెప్పాడు. ఆ ప్రార్థనలకు తన అక్క కూతురు కూడా రావడంతో... ఆమెను వివాహం చేసుకోవాలని కుటుంబ సభ్యులు ప్రతిపాదించారని తెలిపాడు. దానికి తాను నిరాకరించానని, మరో ఐదేళ్ల వరకు అలాంటి ప్రతిపాదన వద్దని స్పష్టం చేశానని, ఆఫర్లు ఇప్పుడిప్పుడే వస్తున్నాయని, పరిశ్రమలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న తాను తొందరపడి పెళ్లి చేసుకోలేనని చెప్పానని తెలిపాడు.
జరిగింది ఇదైతే... తనను కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారని, ఆత్మహత్యాయత్నం చేశానని, తన చేతులకు గాయాలయ్యాయని.. ఇలా ఎవరికి తోచినట్టు వారు సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా తన చేతులను కూడా చూపించాడు. అక్కడ ఎలాంటి గాయాలు లేకపోవడం విశేషం. సోషల్ మీడియా తమకు పలు సందర్భాల్లో మంచి చేసినప్పటికీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు బాధేస్తుందని తెలిపాడు.
తొలిసారి తాను లేడీ గెటప్ వేసినప్పుడు 'అబ్బ.. భలే మేకప్ చేశారే...' అనిపించిందని చెప్పాడు. వినోదినిగా పాప్యులర్ కావడంతో అలాంటి లేడీ గెటప్ అవకాశాలే వస్తున్నాయని తెలిపాడు. వినోదినిగా భ్రమించి చాలా మంది ప్రపోజల్స్ చేశారని, చాలా మంది గిఫ్టులు కూడా పంపుతుంటారని వినోద్ తెలిపాడు. కెరీర్ లో ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్నందున ఇప్పట్లో పెళ్లి చేసుకోనని వినోద్ స్పష్టం చేశాడు.