: ఉలికిపాటుతో వంకర కూతలెందుకు?: రోజా
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతగా, ప్రజలెన్నుకున్న నాయకుడిగా వైకాపా అధినేత వైఎస్ జగన్, ప్రధానిని కలిస్తే, ఉలికిపాటుకు గురైన తెలుగుదేశం నేతలు వంకర కూతలెందుకు కూస్తున్నారని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. రాష్ట్రంలో పరిపాలనను, సంక్షేమాన్ని గాలికి వదిలేసిన చంద్రబాబు వైఖరితో, ప్రజలు పడుతున్న కష్టాలను ప్రధానికి తెలిపేందుకే తమ నేత ఢిల్లీకి వెళ్లారని, దానికి భయాందోళనలు చెందుతున్న టీడీపీ నేతలు, కేసుల మాఫీ కోసమే కలిశారంటూ విమర్శిస్తున్నారని ఆరోపించారు.
కుమారుడిని దూరం చేసుకున్న నారాయణకు అండగా నిలవాల్సిన సమయంలో ఆయన్ను ఓదార్చకుండా జగన్ పై విమర్శలకు దిగడాన్ని రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. కేంద్రంలో ఎవరున్నా కాళ్లు మొక్కే అలవాటు చంద్రబాబుదేనని, గతంలో చిదంబరాన్ని ఆయన అలాగే కలిశారని ఎద్దేవా చేశారు. తనపై ఉన్న కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్న నేత జగన్ అని అన్నారు.