: నా ఇష్టం.. ఎర్రబుగ్గ కారు వాడతా.. నన్నెవరూ ఆపలేరు: ముస్లిం మత గురువు
వీఐపీ కల్చర్ ను రూపుమాపేందుకు కార్లపై ఎర్రబుగ్గలను వాడటాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే కోల్ కతాలోని టిప్పు సుల్తాన్ మసీదు షామి ఇమామ్ మౌలానా నూర్ ఉర్ రెహమాన్ మార్కాతి మాత్రం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు. తాను ఎర్రబుగ్గ ఉన్న కారును వినియోగిస్తానని... ఎవరేం చేస్తారో చూస్తానంటూ వితండవాదం చేస్తున్నారు. ఎర్రబుగ్గ వాడటం తనకు ఉన్న హక్కు అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ సంస్థలకు చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులకు మాత్రమే వర్తిస్తుందని... తనలాంటి మత సంబంధిత వ్యక్తులకు కాదని చెప్పారు. ఎన్నో దశాబ్దాలుగా తన కారుకు ఎర్రబుగ్గ ఉందని... ఓ మత గురువుగా ఎర్రబుగ్గ కారును తాను వినియోగిస్తానని ఆయన తేల్చి చెప్పారు.
ఎర్రబుగ్గ వాడకూడదంటూ తనను ఆదేశించే హక్కు ఎవరికీ లేదని రెహమాన్ చెప్పారు. తమ పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను మాత్రమే తాను పాటిస్తానని తెలిపారు. ఇంకా చెప్పాలంటే, పశ్చిమబెంగాల్ లో ఇంకా ఎవరూ ఎర్రబుగ్గను తొలగించలేదని... తాను మాత్రం ఆ పని ఎందుకు చేయాలని ప్రశ్నించారు. మరోవైపు బీజేపే రాష్ట్ర సెక్రటరీ లాకెట్ ఛటర్జీ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన ఎలా వ్యతిరేకిస్తారని, ఆయనపై మమతా బెనర్జీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా వీఐపీలు ఎవరూ ఎర్రబుగ్గలు వాడరాదన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మే 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.