: అశోక్ గజపతి రాజుకు నేను తెలియకపోవచ్చు... ఆయన నాకు బాగా తెలుసు: పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదంటూ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పవన్ స్పందించారు. తానెవరో అశోక్ గజపతిరాజుకు తెలియకపోవచ్చని... కానీ, ఆయన మాత్రం తనకు బాగా తెలుసని పవన్ నవ్వేస్తూ చెప్పారు. తనకు ఉత్తరాదివారిపై ఏ మాత్రం ద్వేషం లేదని... కాకపోతే, అవకాశాలు అందరికీ సమానంగా ఉండాలనేదే తన కోరిక అని చెప్పారు. దక్షిణాదివారికి కూడా ఉత్తరాదిలో అవకాశాలు ఇవ్వాలని అన్నారు.
దేశంలోని ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కు ఉంటుందని... హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ ను తెలంగాణ ప్రభుత్వం తరలించాలని అనుకోవడం సరైంది కాదని చెప్పారు. ధర్నా చౌక్ కోసం తాను కూడా పోరాటం చేస్తానని చెప్పారు. మిర్చి రైతులను అరెస్ట్ చేయడం చాలా దారుణమని అన్నారు. తాను ఏ పార్టీకి వ్యతిరేకం కాదని.. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే తన కర్తవ్యమని చెప్పారు. జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ ను ఈరోజు హైదరాబాదులోని ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులు కలిశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.