: ట్రాఫిక్ పోలీసును చితక్కొట్టి.. యూనిఫామ్ చించేసి.. రచ్చరచ్చ చేసిన యువతులు
విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ను ఇద్దరు యువతులు చితక్కొట్టారు. అతని యూనిఫామ్ ను కూడా చించేసి రచ్చరచ్చ చేశారు. వివరాల్లోకి వెళ్తే చంఢీగడ్ లో ఇద్దరు యువతులు పూటుగా మద్యం తాగి, ఆ మత్తులో ట్రాఫిక్ సిగ్నళ్లను జంప్ చేసి వెళుతున్నారు. డ్రైవింగ్ చేస్తున్న 29 ఏళ్ల యువతి స్వయంగా పోలీసు సిగ్నల్ ఇచ్చినా ఆగకుండా వెళ్లి పోయింది. దీంతో, పది నిమిషాలు పాటు వారిని వెంబడించి పట్టుకున్నారు పోలీసులు. అది కూడా మరో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వారు ఇరుక్కుపోవడంతో దొరికిపోయారు.
అయితే, అమ్మాయిలే కదా ఏదో ఒకటి సర్ది చెప్పి పంపిద్దామని పోలీసులు భావించారు. కానీ, వీరిలో ఓ యువతి పోలీసులతో గొడవ పెట్టుకుంది. మరో యువతి కారులో ఉన్న బీర్ బాటిల్ తీసుకొచ్చి, తలమీద పగలగొట్టుకుంది. ఆ తర్వాత పోలీసులపై ఇద్దరూ కలిసి దాడికి దిగారు. పక్కనున్న వారు వారిస్తున్నా వారిద్దరూ ఏ మాత్రం తగ్గలేదు.
మరోవైపు అప్పటికే సాయంత్రం 7 గంటలు కావస్తోంది. దీంతో, వారిని అరెస్ట్ చేయవద్దంటూ డ్యూటీ మేజిస్ట్రేట్ పోలీసులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో, తెల్లవారే వరకు వేచి చూసిన పోలీసులు... మరుసరి రోజు ఉదయం వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఐపీసీ 332, 353 సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు.