: విధి ఎంత బలీయం... తలకొరివి పెడతాడనుకున్న కొడుకుకే అంతిమసంస్కారం చేయాల్సిన స్థితిలో నారాయణ!
విధి ఎంత బలీయమైందో మరోసారి తెలిసొచ్చింది. 'పున్నామ నరకం నుంచి కాపాడే వాడు పుత్రుడు' అంటారు. తలకొరివి పెడతాడని భావించిన కొడుకుకే తలకొరివి పెట్టాల్సి వస్తే... అప్పుడా తండ్రి పడే బాధ అంతా ఇంతా కాదు. ఏపీ మంత్రి నారాయణ ఇప్పుడదే పరిస్థితిలో ఉన్నారు. చేతికి అందొచ్చిన కుమారుడు కానరాని లోకాలకు వెళ్లిపోతే, తానే తలకొరివి పెట్టాల్సిన పరిస్థితి. నెల్లూరు శివార్లలోని పెన్నానదీ తీరంలో నిషిత్ అంత్యక్రియల నిమిత్తం ఏర్పాట్లు పూర్తికాగా, అంతిమ యాత్ర రథం అక్కడికి చేరుకుంది.
పక్కనే నారాయణ సహా, పలువురు బంధువులు వెంటరాగా, పుర వీధుల గుండా దాదాపు 45 నిమిషాల పాటు అంతిమయాత్ర సాగింది. మధ్యలో రైల్వే గేటు పడటంతో కొంతసేపు నిలిచిన యాత్ర, ఆపై పెన్నా తీరానికి చేరుకుంది. పైకి ధైర్యంగా కనిపిస్తున్నప్పటికీ, నారాయణ ముఖంలో విషాద ఛాయలు స్పష్టంగా తెలుస్తున్నాయి. స్వయంగా చేత్తో కర్మకాండ కుండను మోసుకుంటూ ఆయన వస్తుంటే, చూసిన ప్రతిఒక్కరూ కన్నీరు పెట్టారు. మరికొద్దిసేపట్లో ఆయన తన కుమారుడి అంతిమ సంస్కార క్రతువును పూర్తి చేయనున్నారు.