: జస్టిస్ కర్ణన్ అరెస్ట్ కోసం చెన్నై, శ్రీకాళహస్తికి చేరుకున్న కోల్‌కతా పోలీసులు.. హైడ్రామా!
కోర్టు ధిక్కారం నేరం కింద కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్‌కు సుప్రీంకోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించడంతో ఆయన మాయమయ్యారు. మంళవారం చెన్నై చేరుకున్న కర్ణన్ అటు నుంచి శ్రీకాళహస్తి వస్తున్నారని తెలిసి కోల్‌కతా పోలీసు బృందం అక్కడికి చేరుకుంది. ఈ సందర్భంగా హైడ్రామా నడిచింది. చెన్నై చేరుకున్న కర్ణన్ అక్కడ అతిథి గృహంలో బస చేసిన విషయం తెలుసుకున్న కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేసేందుకు బుధవారం చెన్నై చేరుకున్నారు. అక్కడ ఆయన కనిపించకపోవడంతో గెస్ట్‌హౌస్ వద్ద పడిగాపులు కాశారు.
అదే సమయంలో పోలీసులకు వ్యతిరేకంగా, కర్ణన్‌కు మద్దతుగా కొందరు న్యాయవాదులు అతిథి గృహం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. మరోవైపు బుధవారం కర్ణన్ ముక్కంటి దర్శనానికి శ్రీకాళహస్తి వస్తున్నారని తెలియడంతో అక్కడ హడావుడి నెలకొంది. ఆయన కోసం ఓవైపు మీడియా, మరోవైపు పోలీసులు కాపుకాశారు. శ్రీకాళహస్తిలోనే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న వార్తలు కూడా హల్‌చల్ చేశాయి. అయితే రాత్రయినా ఆయన శ్రీకాళహస్తి రాలేదు. దీంతో అప్పటి వరకు అక్కడ కాపుకాసిన నిఘా వర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కర్ణన్ నెల్లూరు జిల్లాలోని తడ, చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి పరిసరాల్లో ఉన్నట్టు గుర్తించిన కోల్‌కతా, తమిళనాడు పోలీసులు బృందాలు తడకు చేరుకుని కాపుకాశాయి. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాయి. ఏ క్షణంలోనైనా కర్ణన్‌ను అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.