: పాపం పాము.. ఎండకి తట్టుకోలేక కుక్కర్లో నిద్రపోయింది!
మండిపోతున్న భానుడు మనుషులకే కాదు పాములకూ చుక్కలు చూపిస్తున్నాడు. పుట్టలో సేద దీరాల్సిన వాటిని ఇంట్లో దూరి రిఫ్రిజిరేటర్లు, కుక్కర్లలలో నిద్రపోయేలా చేస్తున్నాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన కైలాశ్ ఇంటిలోకి దూరిన పాము ఏకంగా కుక్కర్లో దూరి హాయిగా నిద్రపోయింది. బుధవారం ఉదయం అన్నం వండేందుకు కుక్కర్‌ను తీసిన కైలాశ్ భార్య అందులో నిద్రపోతున్న పామును చూసి హడలిపోయింది.
వెంటనే చుట్టుపక్కల వారిని పిలిచారు. కుక్కర్‌లో పాము చడీచప్పుడు లేకుండా పడుకుని వుండడంతో దానిని బయటకు తీసేందుకు కష్టమైంది. దీంతో వారు మునిసిపల్ అధికారులకు సమాచారం అందించారు. వారు స్పందించకపోవడంతో జూ అధికారులకు చెప్పినా వారి నుంచీ స్పందన కరవవడంతో చివరికి పాములు పట్టేవారిని పిలిపించారు. చివరికి నాలుగు గంటల తర్వాత కుక్కర్‌లోంచి పామును బయటకు తీశారు. కాగా ఇటీవల ఎండ వేడికి తట్టుకోలేని మరో పాము ఫ్రిడ్జ్‌లో దూరిన సంగతి తెలిసిందే.