: ఎఫ్ బీఐ డైరెక్టర్ జేమ్స్ కామీ పై వేటు!
అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) డైరెక్టర్ జేమ్స్ కామీని ఆ పదవి నుంచి తొలగిస్తూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కామీని తొలగిస్తున్నట్టుగా ట్రంప్ పంపిన లేఖను వైట్ హౌజ్ విడుదల చేసింది. ఎఫ్ బీఐ కి కొత్త చీఫ్ ను నియమించాల్సిన అవసరం ఉందని, ఈ ఏజెన్సీపై ప్రజల్లో నమ్మకం సడలిందని, దీనిని పునరుద్ధరించాల్సిన బాధ్యత తనపై ఉందని ఆ లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. అటార్నీ జనరల్ జెఫ్ సిఫారసు మేరకే కామీపై వేటు వేశామన్నారు.
కాగా, నాటి అధ్యక్షుడు ఒబామా 2013లో జేమ్స్ కామీని ఎఫ్ బీఐ డైరెక్టర్ గా నియమించారు. 2023 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగాల్సి ఉంది. కానీ, ఈ-మెయిల్ స్కామ్ లో హిల్లరీ క్లింటన్ పై కేసు నమోదు చేయకపోవడం వల్లే కామీని ఈ పదవి నుంచి తప్పించినట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలను వైట్ హౌస్ ఖండించింది.