: అమెజాన్ కు 70 లక్షల మేర టోపీ పెట్టిన బెంగళూరు మహిళ
ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ కు ఓ బెంగళూరు మహిళ ఏకంగా రూ. 70 లక్షల మేర టోపీ పెట్టింది. దీంతో, ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే పశ్చిమబెంగాల్ కు చెందిన దీపాన్వితా ఘోష్ (32) బెంగళూరు సమీపంలోని హొరమావు రాజన్న లేఔట్ లో తన భర్తతో కలసి ఉంటోంది. ఆమె ఒక ప్రొఫెషనల్ సర్వీసుల కంపెనీలో పని చేస్తోంది. ఆన్ లైనో తరచుగా ఏదో ఒకటి కొనడం ఈమెకు ఓ హాబీ. అయితే, ఈ మార్గంలోనే డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఆమెకు వచ్చింది.
దీంతో, భారీ మొత్తంలో ఆన్ లైన్ లో వస్తువులు కొనడం... పార్శిల్ లో వచ్చిన అసలైన వస్తువులను తీసేసి, వాటి స్థానంలో నకిలీ సరుకులు ఉంచి... నాణ్యత లేదంటూ తిప్పి పంపించడం మొదలు పెట్టింది. ఆ తర్వాత అసలైన వస్తువులను బయట అమ్మేయడం చేసేది. ఈ రకంగా డబ్బు సంపాదించడం మొదలు పెట్టింది. ఈమె కొని, అమ్మిన వస్తువుల్లో హైఎండ్ మొబైల్స్, కెమెరాలు, టీవీలు, ఇతర ఎలక్ట్రానికి పరికరాలు ఉన్నాయి. తాను కొన్న ప్రతి వస్తువును 24 గంటల్లోగా దీపాన్విత రిటర్న్ చేసేది. అయితే ప్రతిసారి తన అడ్రస్ ను మార్చివేసేది. ఎలాగోలా తన అకౌంట్ లో మాత్రం డబ్బులు వేయించుకునేది. ఈ విధంగా గత ఏడాది కాలంగా అమెజాన్ ను ఈమె మోసం చేస్తూ వచ్చింది.
ఈ నేపథ్యంలో, రిటర్న్ అవుతున్న ఉత్పత్తులపై బెంగళూరులోని అమెజాన్ సెల్లర్ సర్వీసు వారు అంతర్గత విచారణ నిర్వహించగా... దీపాన్వితా ఘోష్ అనే మహిళ వీటన్నింటినీ ఆర్డర్ చేస్తోందని తేలింది. మొత్తం 104 లావాదేవీల ద్వారా రూ. 70 లక్షలు సంపాదించిందని తేలింది. దీంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ నెలాఖరులో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.