: ఆందోళనలో ఐటీ నిపుణులు...ఒక అమెరికన్ కి ఉద్యోగమిస్తే...నలుగురి భారతీయుల ఉద్యోగాలు ఊడుతున్నాయి?


ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో భారతీయుల డాలర్ కలలు కల్లలుగా మారగా... ఇప్పుడు భారత్ సాఫ్ట్ వేర్ నిపుణుల ఆశలు కూడా నీరుగారుతున్నాయి. ఇంత వరకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అంటే... నాలుగంకెల్లో జీతం, ఐదు రోజులే పని దినాలు, వీకెండ్ పార్టీలు...ప్రతి ఏటా 10-15 శాతం జీతం పెంపు... ఇతర సౌకర్యాలు ఇలా ఒకటేమిటి...దర్జాలన్నీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లవే. ఇప్పుడివన్నీ గత వైభవాలుగా మారుతున్నాయి. ట్రంప్ 'బై అమెరికా...దెన్ హైర్ అమెరికన్' నినాదం భారతీయ ఐటీ పరిశ్రమపై పెను ప్రభావం చూపుతోంది. 2000 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో ఏర్పడిన సంక్షోభం....ఇప్పుడు భారత్ లో ఏర్పడినట్టు అనిపిస్తోంది.

విప్రో, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ ఇలా ఒకటేమిటి...ఎన్నో పేరున్న సంస్థలు అమెరికాలో అమెరికన్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఎగబడుతున్నాయి. డాలర్ మారకం విలువతో పోలిస్తే...ఇతర కరెన్సీల విలువ తక్కువగా ఉండడానికి తోడు, ఐటీ పరిశ్రమ అమెరికాలో అగ్రభాగాన ఉండడంతో నిపుణులంతా ఆ దేశానికి వలసవెళ్లే పరిస్థితి కలిగింది. దీనికి తోడు ఐటీ పరిశ్రమలో ఆటోమేషన్ విధానం కూడా ఉద్యోగులకు ప్రతికూలంగా మారింది. మానవ వనరుల స్థానంలో రోబోలు సగం పనిని పూర్తి చేసేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఐటి కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నాయి. కాగ్నిజెంట్‌ 30,000 మందిని వదిలించుకోనుండగా, క్యాప్‌ జెమిని 9,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్నట్టు తెలుస్తోంది. ఐబిఎం, ఇన్ఫోసిస్‌, విప్రోది కూడా అదే బాట. ఈ సంస్థల్లో సుమారు 10 శాతం మందికి ఉద్వాసన తప్పదని తెలుస్తోంది.

ఇలా తొలగిస్తున్న వారిలో మెజారిటీ భాగం టీమ్ లీడర్లు, ఇతర ఉన్నతోద్యోగులే ఉన్నట్టు సమాచారం. అమెరికాలో ఒక ఉద్యోగం ఇవ్వాలంటే... భారత్ లో నలుగురు ఉద్యోగులకు ఉద్వాసన పలకక తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులంతా అక్రమ ఉద్వాసనలను అడ్డుకునేందుకు ‘ఫోరం ఫర్‌ ఐటి ఎంప్లాయీస్‌’ పేరుతో ఒక సరికొత్త కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘం ప్రతినిధులు...ఐటీ పరిశ్రమలో లే ఆఫ్ లను అడ్డుకుని, ఉద్యోగ భద్రతకు భరోసా కల్పించాలని కోరుతూ లేబర్ కమిషన్ ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందిస్తున్నారు.

దీనికి కారణం ఒక్కటేనని...ట్రంప్ మాట వినకుంటే అమెరికా నుంచి ఆర్డర్లు తెచ్చుకునే సంస్థలకు, ఇచ్చిన సంస్థలకు బార్డర్ ట్యాక్స్ పేరుతో భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని, అంతే కాకుండా అమెరికాలో ఉన్న తమ సంస్థలు, అందులోని ఉద్యోగులను ఇబ్బందులు పెడతారని ఐటీ పరిశ్రమల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తలనొప్పులు ఎందుకని భావించిన సంస్థలు నలుగురు భారతీయులను తొలగించైనా సరే ఒక అమెరికన్ కు ఉద్యోగం ఇవ్వాలని భావిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం భారత్ ఐటీ రంగం తీవ్ర ఒడిదుడుకుల్లో ఉంది.

  • Loading...

More Telugu News