: రాత్రి ఒంటిగంట నుంచి వేకువ జాము 5 గంటల వరకు పెట్రోలింగ్ పెంచాలి: హైదరాబాదు పోలీసులకు బొండా ఉమ సూచనలు
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నిషిత్ నారాయణ కారు ప్రమాద స్థలిని ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాదు పోలీసులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... హైదరాబాదులో గతంలో విపరీతంగా యాక్సిడెంట్లు చోటుచేసుకునేవని, అయితే ఇప్పుడు పోలీసుల చొరవతో యాక్సిడెంట్లు తగ్గాయని అన్నారు. నిషిత్ నారాయణ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో కర్వ్ షార్ప్ గా ఉందని అన్నారు. అక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేవని అన్నారు.
హైదరాబాదు పోలీసులకు అవసరమైనన్ని వాహనాలు అందుబాటులో ఉన్నాయని, ఆ వాహనాలపై ఎరుపు రంగు లైట్లు ఉన్నాయని, వాటిని ఆన్ చేసి, ప్రతి కూడలిలో ఉంచితే సత్ఫలితాలు వస్తాయని ఉమ తెలిపారు. రాత్రి 1 గంట నుంచి వేకువ జాము 5 గంటల వరకు పెట్రోలింగ్ పెంచాలని ఆయన సూచించారు. ప్రధానంగా జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 2, 36 వంటి ప్రాంతాల్లో యువకులు వేగంగా వెళ్లే అవకాశం ఉందని, అలాంటి చోట్ల పెట్రోలింగ్ పెంచాలని ఆయన సూచించారు. వాహన చోదకులు కూడా జాగ్రత్తగా వాహనాలు నడపాల్సి ఉంటుందని ఆయన అన్నారు.