: నోట్ల రద్దుతో నల్లధనానికి అడ్డుకట్ట పడబోదు: ఐరాస నివేదిక
నరేంద్ర మోదీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు తరువాత, భవిష్యత్తులో నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట పడుతుందని భావించలేమని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక అభిప్రాయపడింది. నోట్ల రద్దు జరిగి సరిగ్గా ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా ఓ నివేదికను విడుదల చేస్తూ, చలామణిలో ఉన్న 87 శాతం కరెన్సీని రద్దు చేయడం మంచి విషయమే అయినా, దీనివల్ల నల్లధనం ఆగుతుందని భావించలేమని, ఇదే సమయంలో అన్ని రకాలుగా వెల్లడించని ఆస్తులను బయట పెట్టేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని 'ఎకనామిక్ అండ్ సోషల్ సర్వే ఆఫ్ ఆసియా అండ్ ది పసిఫిక్ 2017' పేరిట విడుదల చేసిన రిపోర్టులో యూఎన్ పేర్కొంది.
ఇండియా జీడీపీలో 20 నుంచి 25 శాతం విలువైన నల్లధనం ఉండి వుండవచ్చని, ఇందులో 10 శాతం నగదు రూపంలోనే ఉందని భావిస్తున్నామని తెలిపింది. మరిన్ని డిజిటల్ లావాదేవీలు, నగదు రహిత లావాదేవీలతో చలామణిలో పారదర్శకత పెరుగుతుందని అంచనా వేసింది. ఇండియాలో మొత్తం లావాదేవీల్లో 20 శాతం మాత్రమే డిజిటల్ రూపంలో జరుగుతున్నాయని, వ్యక్తిగత ఖర్చులో 5 శాతమే నగదు రహితమని తెలిపింది.