: రాజమౌళిపై ప్రశంసలు కురిపించిన బాలీవుడ్ దర్శక దిగ్గజం!
'బాహుబలి-2' సినిమాతో భారతీయ సినిమా ఖ్యాతిని దిగంతాలకు చాటిన దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. రాజమౌళిని ప్రశంసించిన వారి జాబితాలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ కూడా చేరాడు. ఎన్నో కష్టాలను అధిగమించి, సృజనాత్మక తెగువతో 'బాహుబలి-2'ను నిర్మించిన రాజమౌళిని ఎంతో అభిమానిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు.
శేఖర్ కపూర్ ట్వీట్ కు అంతే వినమ్రతతో రాజమౌళి సమాధానం ఇచ్చాడు. "శేఖర్ కపూర్ సర్... నా సృజనాత్మక తెగింపుతో ఫెయిల్యూర్ అనే భయం ఎప్పుడూ పెనవేసుకునే ఉంటుంది. మీ అంత గొప్పగా సినిమాలు తీయాలనేదే నా కోరిక. కానీ, తీయలేననే విషయం కూడా నాకు తెలుసు" అని రిప్లై ఇచ్చాడు.
ఈ ట్వీట్ కు శేఖర్ కపూర్ స్పందిస్తూ, ఓటమి అనే భయం సృజనాత్మకతకు చోదకశక్తిగా పని చేస్తుందని తెలిపారు. ఈ భయాన్నే మీరు అద్భుతమైన పనితనంగా మలిచారంటూ కితాబిచ్చారు. శభాష్ రాజమౌళి అంటూ పొగిడారు. మిస్టర్ ఇండియా, క్వీన్ ఎలిజబెత్, ది గోల్డెన్ ఏజ్, బాండిట్ క్వీన్ లాంటి సినిమాలను శేఖర్ కపూర్ తెరకెక్కించారు.