: కాకినాడలో మహిళా సీఈఓ కిడ్నాప్ ప్రయత్నం... బైక్ పై ఫాలో అయిన యువకుడు.. చాకచక్యంగా నిరోధించిన వైనం!


కాకినాడలో నిన్న కిడ్నాప్ కు గురైన మహిళ ఉదంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే... కాకినాడలోని యాక్ట్‌ షిప్పింగ్‌ ఫార్వర్డు కంపెనీ యజమాని వీర వెంకట సత్య సాయి భార్య ధనలక్ష్మి ఆ సంస్థ సీఈఓ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రతి రోజు ఆమె కారులో ఆఫీసుకు వెళ్లి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆమెను కిడ్నాప్ చేయడం ద్వారా 50 లక్షల రూపాయలు దండుకుని, సెటిలైపోవాలని ఆమె కారు డ్రైవర్ దయ భావించాడు.

ఈ నేపథ్యంలో స్నేహితులతో కలిసి ప్లాన్ వేశాడు. ఈ నేపథ్యంలో రోజూలా ఆమెను తీసుకెళ్లేందుకు డ్రైవర్ దయ ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ధనలక్ష్మి కారు ఎక్కారు. మామూలుగా ప్రతి రోజూ కాకినాడ కల్పన సెంటర్‌ లో ఉన్న రైల్వే ఓవర్‌ బ్రిడ్జి, దుమ్ములపేట మీదుగా పోర్టు సమీపంలో ఉన్న కంపెనీ కార్యాలయానికి ఆమె వెళ్తుంటారు. అయితే రోజూ వెళ్లే మార్గంలో కాకుండా వేరే మార్గంలో కారు వెళ్లడాన్ని ఆమె గుర్తించారు.

 దీంతో అనుమానం వచ్చిన ధనలక్ష్మి...‘అలా వెళ్లాల్సింది ... ఇలా వెళుతున్నావేమిటని’ అని ప్రశ్నించారు. దీంతో ఆమెకు అనుమానం వచ్చిందని గుర్తించిన దయ ఒక్కసారిగా కారు వేగం పెంచాడు. దీంతో కల్పన సెంటర్ మీదుగా కారును పోనిచ్చి షడన్ గా అక్కడ ఆపాడు. కారు ఇలా ఆగగానే, ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు చెరొకవైపు నుంచి కార్లోకి ఎక్కారు.

దీనిని బయట వున్న ఒక యువకుడు చూశాడు. మనకెందుకులే అని ఆ యువకుడు అనుకోలేదు. అనుమానంతో బైక్ పై కారును అనుసరించాడు. కారు అద్దాల నుంచి కారులో మహిళ చెరోవైపు ఎక్కిన వ్యక్తులతో పెనుగులాడుతున్నట్టు గుర్తించాడు. ఇంతలో 'రక్షించండి' అన్న కేక వినిపించడంతో... వేగంగా స్పందించి, బైక్ స్పీడ్ పెంచి 100 నెంబర్ కు డయల్ చేశాడు. కారు సంగతి పోలీసులకు వివరించాడు. కిడ్నాప్ అన్న అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు యువకుడ్ని ఉత్సాహపరుస్తూ... తాము వస్తున్నామని రూట్ అడిగి తెలుసుకున్నారు.

ఉప్పాడలో కాపుకాసిన పోలీసులు, కారును ఆపే ప్రయత్నం చేశారు. కారు మరింత వేగంగా వెళ్లడంతో కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేట వాసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ గ్రామస్థులు ఒక లారీని రోడ్డుకు అడ్డంగా పెట్టి కారును చాకచక్యంగా అడ్డుకున్నారు. దీంతో ఇక దొరికిపోకతప్పదని నిర్ణయించుకున్న కిడ్నాపర్లు... ‘మమ్మల్ని వదలక పోతే మహిళను చంపేస్తా’మని బెదిరింపులకు దిగారు.

 అయితే వారితో బేరసారాలకు దిగిన గ్రామస్థులు చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకుని దుండగులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనలో ప్రధాన సూత్రధారుడు దయ మాత్రం తప్పించుకుపోవడం విశేషం. ఆమెను కారులో కిడ్నాప్ చేసి, వైజాగ్ తీసుకెళ్లి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేయాలన్నది తమ ప్లాన్ అని వారు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News