: మీరు చంద్రమండలం మీదైనా బతికేస్తారు.. ప్రవాసాంధ్రుల చొరవపై చంద్రబాబు కామెంట్
అమెరికాలో పర్యటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి శాన్‌జోస్‌లో ఘన స్వాగతం లభించింది. అక్కడి ఏపీ ఎన్ఆర్‌టీ నిర్వహించిన కార్యక్రమానికి ప్రవాస తెలుగువారు, టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రవాసాంధ్రులు తనకు మద్దతుగా నిలిచారని, కొందరైతే ఉద్యోగాలు వదిలేసి వచ్చి మరీ తనను గెలిపించేందుకు ప్రయత్నించారని గుర్తు చేశారు. అమెరికాలో ఎన్నారై టీడీపీ విభాగాన్ని బలోపేతం చేస్తామని అన్నారు.
ఇక్కడున్న తెలుగువారిని, వారి ఉత్సాహాన్ని చూస్తుంటే తాను కాలిఫోర్నియాలో ఉన్నానో, అమరావతిలో ఉన్నానో అర్థం కావడం లేదంటూ చమత్కరించారు. ఈ సమావేశానికి శాన్‌జోస్ మేయర్, కాంగ్రెస్ మహిళా, సెనేట్ సభ్యులు కూడా రావడాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తూ ఇక్కడి తెలుగువారికి ఎంత చొరవ ఉందో వారి రాకను బట్టే చెప్పేయవచ్చన్నారు. మీ చొరవను చూస్తుంటే చంద్రమండలంపైన అయినా బతికేస్తారని, అంగారకుడి మీదికి వెళ్లే ప్రయోగాలు విజయవంతమైతే అక్కడికి వెళ్లే వారిలో తొలుత మీరే ఉండాలని చమత్కరించడంతో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.