: కన్నీరొచ్చినంత మాత్రాన బలహీనురాలిని కాదు: ఐపీఎస్ చారూ నిగమ్
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఎంఎల్ఏ రాధా మోహన్ అగర్వాల్ గట్టిగా గద్దించిన వేళ, కన్నీరు పెట్టుకున్న ఐపీఎస్ అధికారిణి చారూ నిగమ్, నేడు తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. తన కంట్లో నీరు వచ్చినంత మాత్రాన తాను బలహీనురాలిని కాదని, తాను తీసుకున్న శిక్షణ బలహీనతను నేర్పించలేదని అన్నారు. ఎస్పీ గణేష్ సాహా అక్కడికి వచ్చిన తరువాత, అంతకుముందు జరిగిన ఘటనపై మనస్తాపం చెందానని, అందువల్లే కన్నీరు పెల్లుబికిందని అన్నారు. మహిళలు నిరసన తెలుపుతున్న సమయంలో అక్కడున్న సీనియర్ అధికారిని తానే కాబట్టి నిరసనకారులను పక్కకు లాగాలని నిర్ణయించానని తెలిపారు. ఆ సమయంలో రాధామోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను చిత్రీకరించి, ప్రజలకు వాస్తవాలను తెలియజేసిన మీడియాకు కృతజ్ఞతలని పేర్కొన్నారు.