: బీజేపీ నేత తిట్లకు కన్నీళ్లు పెట్టుకున్న ఐపీఎస్ అధికారిణి!


ఓ బీజేపీ నేత వాగ్వాదానికి దిగి తిడుతుంటే తట్టుకోలేని ఓ యువ ఐపీఎస్ అధికారిణి కన్నీరు పెట్టుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం గోరఖ్ పూర్ లో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఈ ప్రాంతంలో అక్రమ మద్యం అధికంగా ఉందని, దాన్ని నివారించాలని డిమాండ్ చేస్తూ, మహిళలు రాస్తారోకోకు దిగిన వేళ, పరిస్థితి విషమించడంతో మహిళా పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. నిరసన చేస్తున్న మహిళల్లో కొందరు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో, లాఠీచార్జ్ చేయగా కొంతమంది మహిళలకు గాయాలు అయ్యాయి.

విషయం తెలుసుకున్న గోరఖ్ పూర్ ఎమ్మెల్యే, సీనియర్ నేత డాక్టర్ రాధామోహన్ దాస్ అగర్వాల్ అక్కడికి చేరుకున్నారు. అక్కడే విధుల్లో ఉన్న 2013 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి, గోరఖ్ పూర్ లో శిక్షణలో ఉన్న చారూ నిగమ్ అనే పోలీసు అధికారిణి ఆయనకు టార్గెట్ అయింది. ఆమెతో వాగ్వాదానికి దిగిన రాధామోహన్ దాస్, నువ్వు హద్దులు దాటొద్దంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. వీడియోల్లో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం, "నేను నీతో మాట్లాడటం లేదు. నాకేమీ చెప్పొద్దు. నోర్ముయ్. హద్దులు దాటొద్దు" అంటూ పదేపదే అరిచారు. తానిక్కడ ఇన్ చార్జ్ అధికారినని, తానేం చేస్తున్నానో తనకు తెలుసునని చారూ నిగమ్ చెబుతున్నా ఆయన వినలేదు. ఎమ్మెల్యే కేకలకు చారూ నిగమ్ కళ్ల వెంబడి నీళ్లు వచ్చాయి. ఓ హ్యాండ్ కర్చీఫ్ తో ఆమె కళ్లు తుడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.

ఆపై రాధామోహన్ దాస్ మాట్లాడుతూ, మద్యం షాపులకు తాము వ్యతిరేకమని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై మహిళా పోలీసు అధికారి దాష్టీకానికి పాల్పడ్డారని ఆరోపించారు. 80 సంవత్సరాల వృద్ధురాలని కూడా చూడకుండా ఒకామెను లాక్కెళ్లిపోయారని, ఇది తీవ్రమైన చర్యేనని, వీటిని చూస్తూ ఊరుకోబోయేది లేదని హెచ్చరించారు. ఇక్కడి లిక్కర్ మాఫియాతో పోలీసులు లాలూచీ పడ్డారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News