: చంద్రబాబును అరెస్ట్ చేయాలంటూ ఇర్విన్ మేయర్ కు పంపిన మెయిల్ లో ఏముందంటే..!
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబును అరెస్ట్ చేయాలని కోరుతూ ఇర్వింగ్ మేయర్ కు ఓ ఈ-మెయిల్ రాగా, ఆయన స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వడం, ఆపై పోలీసులు వెళ్లి చంద్రబాబుకు భద్రత కల్పించడం తెలిసిందే. ఇండియన్స్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ రైట్స్ పేరిట వచ్చిన ఈ-మెయిల్ లో ఏముందంటే...
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు మే నెల 4వ తేదీ నుంచి అమెరికాలో పర్యటిస్తున్నారు. టెక్సాస్, కాలిఫోర్నియా, ఇలినోయిస్, న్యూయార్క్, న్యూజెర్సీల్లో వారి పర్యటన సాగనుంది. ఈ ప్రాంతాల్లో వారు నిధులు సేకరించేందుకు ప్రణాళికలు రచించినట్లు సమాచారం. మొదటి వరుస సీట్లను వెయ్యి అమెరికా డాలర్లకు విక్రయిస్తున్నారు. ఇలా నిధులు సేకరించే కార్యక్రమాన్ని మే 6వ తేదీన ఇర్వింగ్ లోని సిటీ హాలులో కూడా ఏర్పాటు చేశారు.
మిస్టర్ నాయుడు ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేస్తూ, హోంశాఖను కూడా చూస్తున్నారు. ఆయన పరిపాలనలో 20 మంది పేద ఎర్రచందనం కూలీలను పోలీసులు ఎలాంటి కవ్వింపు చర్యలూ లేకుండానే చంపేశారు. వారిని ప్రభుత్వం స్మగ్లర్లుగా పేర్కొంది. కానీ వీరంతా రోజు కూలీ కోసం పని చేసేవారే. రెడ్ శాండల్ స్మగ్లింగ్ మాఫియా ఈ కూలీలను నియమించుకుంటుంది. ఈ మాఫియాకు అధికార పార్టీలో ఉన్న పలువురు రాజకీయ నాయకులతో సంబంధాలున్నాయి. ఎర్రచందనం కూలీలను అత్యంత సమీపం నుంచి తుపాకులతో కాల్చి చంపారని పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది. మరిన్ని వివరాలు ఈ వెబ్ సైట్ లో (వికీపీడియా అడ్రెస్) చూడవచ్చు.
అందువల్ల చంద్రబాబునాయుడు అమెరికాలో అడుగుపెట్టకుండా చూడండి. ఒక వేళ ఆయన వచ్చినా, మానవ హక్కుల ఉల్లంఘన నేరానికి ఆయన్ను అరెస్టు చేసి ప్రాసిక్యూట్ చేయాలి. మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడేవారు నిధులు సేకరించేందుకు అమెరికాను ఒక వేదికగా వాడుకోనివ్వకుండా చూడాలి.
- థ్యాంక్స్'
అంటూ ఈ-మెయిల్ లో పేర్కొనడం జరిగింది.