: 'వాళ్లు నన్ను చంపేస్తార'ని 13 లేఖలు రాసిన పాప్ రారాజు మైఖేల్ జాక్సన్...వెలుగులోకి వచ్చిన ఆసక్తికర కోణం


కింగ్ ఆఫ్ పాప్ గా ప్రపంచంతో నీరాజనాలు అందుకున్న తన తండ్రి మైకేల్ జాక్సన్ డ్రగ్స్ కారణంగా చనిపోలేదని, తన తండ్రిని హత్య చేశారని ఆయన కూతురు పారిస్ జాక్సన్ పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మరణం గురించిన ఆసక్తికర కోణం వెలుగు చూసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఒక ఛానెల్ మైకేల్ జాక్సన్ పై స్టోరీ చేస్తూ, ఆయన ఆప్తులను ఇంటర్వ్యూ చేసింది. మైఖేల్ జాక్సన్ స్నేహితుడైన జర్మనీ వ్యాపారవేత్త జాకబ్‌ షేగెన్‌ ను ఆ చానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా మైఖేల్ జాక్సన్ మరణానికి ముందు తనకు 13 లేఖలు రాశాడని ఆయన తెలిపారు. ప్రతి లేఖలోనూ వారు తనను చంపేస్తారనే ఆందోళన వ్యక్తం చేశాడని అన్నారు. ‘నన్ను వాళ్లు చంపాలని చూస్తున్నారు. నాకు చాలా భయంగా ఉంది. నన్ను కచ్చితంగా చంపేస్తారు. నువ్వు నా దగ్గరికి రా’ అంటూ ఆ లేఖల్లో ఆయన తన భయాన్ని వ్యక్తం చేశాడని చెప్పారు.

అయితే ప్రతీ లేఖలోనూ ‘వాళ్లు నన్ను చంపాలని చూస్తున్నారు’ అని పేర్కొన్న మైఖేల్ జాక్సన్ 'ఆ వాళ్లు' ఎవరు? అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. దీంతో ఆందోళనతో జక్సన్ ను కలిసేందుకు వెళ్లిన జాకబ్ కు ఆయన కన్నీటి స్వాగతం పలికాడట. ఆ సందర్భంగా తనను గట్టిగా కౌగిలించుకుని, లండన్‌ కి చెందిన ఓ కచేరి సంస్థ ఏఈజీ ఒత్తిడికి గురిచేస్తోందని, జీవితం గురించి భయంగా ఉందని చెప్పాడని ఆయన వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 2009 జూన్ 25న ఆయన మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ రోజున ఆయన గురించిన రహస్యాలు వెల్లడిస్తూ సదరు టీవీ ఛానెల్ ప్రత్యేక కథనం ప్రసారం చేయనుంది. దీనికోసమే జాకబ్ ను ఇంటర్వ్యూ చేసింది. వారిద్దరి మధ్య పదేళ్లకు పైగా స్నేహమని సదరు ఛానెల్ తెలిపింది. ఇంతకాలం ఈ విషయాలను దాచిన జాకబ్... తాజా ఇంటర్వ్యూలో మైఖేల్ జాక్సన్ కుమార్తె పారిస్ జాక్సన్ పోరాటానికి మద్దతిస్తానని ప్రకటించారు.  

  • Loading...

More Telugu News