: టీటీడీ ఈవో గా ఉత్తరాది వ్యక్తా? కోర్టును ఆశ్రయిస్తా!: స్వామి స్వరూపానంద సరస్వతి మండిపాటు
తిరుమల- తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈఓగా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తిని నియమించడం దురదృష్టకరమని శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి అన్నారు. అమరావతిలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మాజీ ఈఓ సాంబశివరావును మార్చడం పనికిమాలిన ఆలోచన అని, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు ఈ సంఘటనే నిదర్శనమని అన్నారు.
తెలుగు చదవడం, మాట్లాడటం రాని వారిని ఈఓగా ప్రభుత్వం ఎలా నియమిస్తుందని ప్రశ్నించారు. ఈఓ స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ఆగమానికి సంబంధించి సమస్యలు వస్తాయని వివరించారు. ఉత్తర ప్రాంతంలో ఆగమాలతో సంబంధం లేకుండా భక్తి ఉంటుందని అన్నారు. టీటీడీకి ఉత్తరాది వ్యక్తిని నియమించడంపై కోర్టుకు వెళతామని, ఇక ముందు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇలాంటి చర్యలు తీసుకోకుండా పోరాటం చేస్తానని తెలిపారు.