: దుస్తులు ఉతికేందుకు నదికి వెళ్లి.. మొసలికి ఆహారమైన మహిళ
దుస్తులు శుభ్రం చేసేందుకు నదికి వెళ్లిన ఓ మహిళ మొసలికి చిక్కి మరణించిన ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఝగాడియా తెహసీల్లోని భలోడ్ గ్రామానికి చెందిన దక్షాబెన్ తేవర్ (45) దుస్తులు ఉతికేందుకు గ్రామం మీదుగా ప్రవహించే నర్మదా నదికి వెళ్లింది. దుస్తులు నది ఒడ్డున పెట్టి నీళ్లలోకి దిగగానే మొసలి ఆమెపై దాడిచేసి నదిలోకి ఈడ్చుకుని వెళ్లిపోయింది.
ఈ ఘటనను చూసిన అక్కడే ఉన్న మత్స్యకారులు వెంటనే నీళ్లలోకి దూకి ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. కర్రలతో మొసలిని బాది దక్షాబెన్ను రక్షించేందుకు చూశారు. దెబ్బలకు తాళలేని మొసలి మహిళను వదిలిపెట్టింది. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. నదిలో మొసలి తిరుగుతున్న విషయాన్ని అటవీ అధికారులకు తెలియజేసినట్టు పోలీసులు తెలిపారు.