: నేనేమీ టెక్కీని కాదు: డల్లాస్ లో చంద్రబాబు
నవ్యాంధ్రకు పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా అమెరికాలో సాగుతున్న సీఎం చంద్రబాబునాయుడు పర్యటన డల్లాస్ కు చేరుకుంది. ఇప్పటికే పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయి, కొత్త పరిశ్రమలు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్న ఆయన, నేడు మరిన్ని సంస్థలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తానేమీ టెక్కీని కాదని, శాస్త్రవేత్తను అంతకన్నా కాదని అన్నారు. అయితే, సాంకేతికతను వినియోగించుకుంటే, ప్రజల జీవితాలపై పడే ప్రభావాన్ని అర్థం చేసుకున్నానని అన్నారు. గతంలోనూ ఇక్కడికి వచ్చి ప్రతి ఐటీ ప్రముఖుడినీ హైదరాబాద్ కు ఆహ్వానించానని గుర్తు చేశారు.
ప్రస్తుతం ఇండియా ప్రపంచంలోనే బలమైన దేశంగా ఎదుగుతోందని, ప్రధాని మోదీ నాయకత్వం దేశానికి భరోసాగా నిలిచిందని అన్నారు. ప్రపంచ దేశాలకు అతిపెద్ద మార్కెట్ గా, గొప్ప లాజిస్టిక్ హబ్ గా భారత్ నిలిచిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో 12 నుంచి 15 శాతం వృద్ధిని నమోదు చేయడమే తన లక్ష్యమని అన్నారు. టెక్నాలజీ సాయంతో అన్ని రంగాల్లో అగ్రస్థానాన్ని అందుకోవాలని భావిస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయంతో పాటు రవాణా, వైద్య, విద్యా, వైజ్ఞానిక రంగాల్లో సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నామని చంద్రబాబు తెలియజేశారు. తద్వారా ఏపీ నాలెడ్జ్ హబ్ గా మారుతుందన్న నమ్మకం ఉందని అన్నారు.