: విమలక్కకు చెందిన అరుణోద‌య కార్యాల‌యాన్ని ఖాళీ చేయించిన పోలీసులు.. నాలుగు గంట‌ల‌పాటు హైడ్రామా!


కోర్టు ఆదేశాల‌తో హైద‌రాబాద్‌లోని అరుణోద‌య సాంస్కృతిక స‌మాఖ్య కార్యాల‌యాన్ని పోలీసులు ఖాళీ చేయించారు. అర‌వింద్ న‌గ‌ర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న విమ‌ల‌క్క 2009 నుంచి అరుణోద‌య రాష్ట్ర కార్యాల‌యాన్ని నిర్వ‌హిస్తున్నారు. గ‌తేడాది డిసెంబ‌రులో నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి పోలీసులు ఓ కేసులో నిందితుడైన భీంభ‌ర‌త్ అనే వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా అత‌డిచ్చిన స‌మాచారంతో అరుణోద‌య కార్యాల‌యంలో సోదాలు చేసిన పోలీసులు నిషేధిత వ‌స్తువులు క‌నుగొన్నారు. దీంతో కార్యాల‌యాన్ని సీజ్ చేశారు.

ప్ర‌స్తుతం అరుణోద‌య కార్యాల‌యం ఉన్న ఇంటిని 2009లో ఇంటి య‌జ‌మాని ఆర్‌ఎస్ శాస్త్రి.. క‌రియ‌మ్మ అనే మ‌హిళ‌కు అద్దెకు ఇచ్చారు. అయితే అందులో అరుణోద‌య కార్యాల‌యాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలియ‌డంతో త‌న ఇంటిని ఖాళీ చేయించాలంటూ కోర్టు కెక్కారు. గ‌త నెల 25న కోర్టు త‌మ‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింద‌ని శాస్త్రి తెలిపారు. కోర్టు ఆదేశాల‌తో పోలీసులు శ‌నివారం ఇంటిని ఖాళీ చేయించారు. అంత‌కుముందు నాలుగు గంట‌ల‌పాటు అరుణోద‌య కార్యాల‌యం వ‌ద్ద హైడ్రామా చోటుచేసుకుంది. విమ‌ల‌క్క ఇత‌ర క‌ళాకారులు అక్క‌డికి చేరుకుని కోర్టు ఆదేశాల‌ను త‌మ‌కు ఇవ్వ‌కుండా ఎలా ఖాళీ చేయిస్తారంటూ పోలీసుల‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు ఆమెకు కోర్టు ఆదేశాల‌ను అంద‌జేశారు. కాగా, విష‌యం తెలిసిన విద్యావేత్త చుక్కా రామ‌య్య‌, న్యూడెమొక్ర‌సీ నాయ‌కుడు గోవ‌ర్ధ‌న్ త‌దితరులు విమ‌ల‌క్క‌ను క‌లిసి ప‌రిస్థితి గురించి ఆరా తీశారు.

  • Loading...

More Telugu News