: ఆపిల్ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ విల్లియమ్స్ తో చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో రెండో రోజు కూడా బిజీబిజీగా గడుపుతున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగుతోంది. దిగ్గజ సంస్థ ఆపిల్ ను ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చేందుకు ఆయన గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఆయన ఆపిల్ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ విల్లియమ్స్ తో భేటీ అయి, పలు అంశాలపై చర్చించారు. స్థిరమైన అభివృద్ధిని సాధిస్తోన్న భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన సమయమని చంద్రబాబు ఆయనకు వివరించారు. రాజధాని నిర్మాణం జరుగుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఇదే అద్భుత అవకాశమని ఆయన విలియమ్స్ తో అన్నారు. మంచి ఉత్పాదక సామర్థ్యం ఉన్న యువతను ఏపీ కలిగి ఉందని, ఆపిల్ సంస్థ కాలుమోపేందుకు అన్ని అనుకూలతలూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని ఆయన అన్నారు.