: 'నాలా ఆడొద్దు...నా బ్యాటింగ్ వీడియోలు చూడొద్దు' అంటూ యువకులకు బోధించిన భారత దిగ్గజ క్రికెటర్
సాధారణంగా ఏదైనా రంగంలో ఓ దిగ్గజం ఉంటే... ఇతరులు అతని అడుగుజాడల్లో నడిచే ప్రయత్నం చేస్తారు. అయితే టీమిండియా దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ మాత్రం తన అడుగు జాడల్లో నడవవద్దని చెబుతున్నాడు. సిద్దూ, అజహరుద్దీన్, సచిన్, గంగూలీ, లక్ష్మణ్, సెహ్వాగ్, యువరాజ్ సింగ్ వంటి ఆటగాళ్ల సమకాలీనుడిగా ఉండి అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న రాహుల్ ద్రవిడ్... ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు కోచ్ కమ్ మెంటార్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో వర్ధమాన ఆటగాళ్లు సంజు శాంసన్, రిషబ్ పంత్ అద్భుతంగా రాణించడం వెనుక ఉన్న శక్తి గురించి అడిగితే వారిద్దరూ ముక్తకంఠంతో రాహుల్ ద్రవిడ్ పేరు చెబుతారు. దీంతో వారికి ఏం నేర్పారని రాహుల్ ద్రవిడ్ ను అడిగితే మాత్రం... తనలా ఆడద్దని చెబుతానని అన్నారు. తన వీడియోలు చూడవద్దని వారికి సూచిస్తానని, తనలా ఆడే ప్రయత్నం చేయవద్దని చెబుతానని అన్నారు. దూకుడుగా ఆడాలని, టీ20ల్లో ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి నెట్టాలని చెబుతానని అన్నారు. తనలా ఆడకపోవడం వల్లే వారిద్దరూ రాణిస్తున్నారని ఆయన తెలిపారు. కాగా, సంజు శాంసన్ తన డ్రీమ్ హీరో రాహుల్ ద్రవిడ్ అని పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే.