: 26 ఏళ్ల తర్వాత వివాదాస్పద ఏఎఫ్ఎస్పీఏ ఉపసంహరణ.. నిర్ణయించిన అసోం ప్రభుత్వం!
రెండున్నర దశాబ్దాల తర్వాత వివాదాస్పద సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) కొన్ని ప్రాంతాల్లో ఎత్తివేయాలని అసోం ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో కేంద్రం నుంచి సూచనలు రాకముందే ఆ పనిచేయాలని నిర్ణయించినట్టు సమాచారం. జమ్ముకశ్మీర్, మణిపూర్లోనూ ఉన్న ఈ చట్టం కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమవుతోంది. అసోంను కల్లోల ప్రాంతంగా ప్రకటించిన కేంద్రం నవంబరు 27, 1990లో ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ సాయుధ దళాలకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టింది.
గత 26 ఏళ్లుగా రాష్ట్రంలో ఏఎఫ్ఎస్పీఏ అమలులో ఉందని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ బ్రాంచ్) పల్లభ్ భట్టాచార్య తెలిపారు. హోంమంత్రిత్వ శాఖతో జరిగిన సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొన్ని ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఏఎఫ్ఎస్పీఏను ఎత్తివేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ సెక్యూరిటీని ఏర్పాట్లు చేస్తామని వివరించారు.