: దోపిడీ ఎఫెక్ట్!.. నగదు లావాదేవీలు నిలిపివేయాలని జమ్ముకశ్మీర్ బ్యాంకులకు ఆదేశం!
జమ్ముకశ్మీర్‌లోని బ్యాంకులను ఉగ్రవాదులు యథేచ్ఛగా దోచుకుంటుండడంతో స్పందించిన మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం నగదు లావాదేవీలు నిలిపివేయాలంటూ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా, షోపియాన్ జిల్లాలోని 40 బ్యాంకు శాఖల్లో తక్షణం నగదు లావాదేవీలు నిలిపివేయాలని శుక్రవారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ 40 శాఖలు ఉగ్రవాదులకు లక్ష్యంగా మారే అవకాశం ఉందన్న ప్రభుత్వ అడ్వైజరీ సూచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బ్యాంకు శాఖలను మరో చోటికి తరలించే ప్రసక్తే లేదని, సాధారణంగానే పనిచేస్తాయని బ్యాంకు అధికారులు తెలిపారు.
అయితే ఖాతాదారులు డబ్బులు జమ చేయడం, ఉపసంహరించడం మాత్రం కుదరదని పేర్కొన్నారు. ఈ శాఖలన్నీ క్యాష్‌లెస్ లావాదేవీలు కొనసాగిస్తాయని వివరించారు. ఖాతాదారులు చెక్‌లను డిపాజిట్ చేయడం, నగదు బదిలీ చేయడాన్ని అనుమతించనున్నట్టు అదికారులు పేర్కొన్నారు. కాగా, లోయలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఏటీఎంలను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నట్టు వస్తున్న వార్తలను బ్యాంకు అధికారులు ఖండించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జమ్మూకశ్మీర్‌లో ఆరు బ్యాంకు దోపిడీలు జరిగాయి. మే 1వ తేదీన జరిగిన దోపిడీలో ఐదుగురు పోలీసులు, ఇద్దరు బ్యాంకు సెక్యూరిటీ గార్డులు మృతి చెందారు.