: క్రైం సీరియళ్లు చూశాడు.. అచ్చం అందులోలాగే చేసి చంపేశాడు!
టీవీలలో వచ్చే క్రైం సీరియళ్లు ఫాలో అవుతూ అందులోని క్రైమ్‌ని కూడా అనుసరించేశాడు ఓ హైదరాబాద్ యువకుడు. క్రైం సీరియళ్లలో కిడ్నాపులు, హత్యలు, దోపిడీలు, హింస వంటి దృశ్యాలను చూసీ చూసీ తాను కూడా అలా చేస్తే ఎలా ఉంటుంది? అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఇటీవల నమాజ్‌కు వెళ్తున్న ఓ బాలుడిని కిడ్నాప్ చేసిన ఆ యువకుడు, అనంతరం ఏం చేయాలో తెలియక ఆ బాలుడి గొంతు నులిమాడు. నిందితుడి చర్యకు భయపడిపోయి పారిపోయేందుకు బాలుడు ప్రయత్నించినప్పటికీ అతను వదలలేదు. వెంటపడి మరీ పట్టుకుని హత్య చేశాడు. తరువాత ఆ మృతదేహాన్ని ఓ మురికి కాల్వలో పడేశాడు. నిన్న ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన ఆ యువకుడు తాను చేసిన తప్పుని ఒప్పుకుని, క్రైం సీరియళ్లలో చూసి ఇవన్నీ నేర్చుకున్నానని చెప్పాడు.
నిందితుడు హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మునీర్ అని పోలీసులు చెప్పారు. తమ పక్కింట్లో ఉండే ఉరూజుద్దీన్ అనే బాలుడిపై ఇలా దారుణానికి పాల్పడ్డాడని వివరించారు. ఏప్రిల్ 22వ తేదీ ఉదయం ఇంట్లోంచి వెళ్లిన తమ కుమారుడు రాత్రయినా తిరిగి రాకపోవడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని స్థానికులను విచారించామని, అనంతరం సీసీ కెమెరాలను పరిశీలించగా మునీరే ఆ బాలుడిని తీసుకెళ్లినట్లు తాజాగా తెలిసిందని పోలీసులు వివరించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు.