: కాశ్మీర్ లోయలో ఎంత వ్యతిరేకత?... నిషేధిత టీవీ చానల్స్ ను చూస్తున్న ప్రజలు: సైన్యం అతిపెద్ద సెర్చ్ లో వెలుగులోకి సంచలన విషయాలు


కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు స్వేచ్ఛగా సంచరిస్తున్న వీడియోలు బహిర్గతం కావడంతో, వారి ఏరివేతే లక్ష్యంగా అతిపెద్ద కార్డన్ సెర్చ్ చేపట్టి, దాదాపు 20కి పైగా గ్రామాలను జల్లెడపడుతూ, ఇల్లిల్లూ తిరిగి సోదాలు చేస్తున్న భద్రతా దళాలు సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చాయి. ఇండియాలో నిషేధించబడిన పలు పాకిస్థానీ, సౌదీ అరేబియా టీవీ చానళ్లను ప్రజలు తమ టీవీల్లో చూస్తున్నారు. సుమారు 50కి పైగా పాక్ చానళ్లు కాశ్మీరీల ఇళ్లలో వస్తున్నాయని, ఇవన్నీ భారత్ పై వ్యతిరేకతను నూరిపోస్తున్నాయని గుర్తించారు. జకీర్ నాయక్ పీస్ టీవీ సైతం ఈ జాబితాలో ఉందని, కాశ్మీరులో ప్రైవేట్ కేబుల్ నెట్ వర్క్ ఆపరేటర్లు వీటి ప్రసారాలను అందిస్తున్నారని సైన్యం గుర్తించింది.

ఒక్క శ్రీనగర్ లోనే పాక్, సౌదీ చానళ్లను 50 వేల ఇళ్లకు అందిస్తున్నారని, వీటిల్లో సౌదీ సున్హా, సౌదీ ఖురాన్, అల్ అలరేబియా, పైగామ్, హిదాయత్, నూర్, మదాని, షెహర్, కర్బాలా, హదీ, ఏఆర్వై క్యూటీవీ, బేహత్, అహ్లీబత్, ఫలాక్, డాన్ న్యూస్ తదితర ఎన్నో భారత ప్రభుత్వం నిషేధించిన చానళ్లు కాశ్మీర్ లో ప్రసారం అవుతున్నాయి. ఇవన్నీ మరణించిన హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరే తోయిబా కమాండర్లను అమర వీరులుగా కొనియాడుతూ, యవతను ఇండియాకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నాయి.
లోయలో భారత్ పట్ల ఎంతో వ్యతిరేకత ఉందని, సోదాలకు ఎవరూ కూడా సహకరించలేదని, యథావిధిగా యువత రాళ్లు రువ్విందని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. సైన్యం ఎక్కడికి వెళ్లినా, రాళ్లతోనే స్వాగతం లభించిందని వెల్లడించారు.

 కాగా, రాష్ట్రీయ రైఫిల్స్ తో పాటు సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఈ సోదాలు నిర్వహిస్తుండగా, ఇమామ్ సాహిబ్ ప్రాంతంలో హిజ్బుల్ మిలిటెంట్లు దాడికి దిగి సైనిక వాహనం నడుపుతున్న డ్రైవర్ ను హత్య చేశారు. ఈ దాడిలో నలుగురు జవాన్లకు గాయాలు అయ్యాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. లోయలోని హీఫ్, సుగాన్, చిలిపోరా, మల్నాడ్, తుర్క వాంగం తదితర ప్రాంతాల్లో యువకులు సైన్యంపై రాళ్ల దాడులు చేశారని వెల్లడించారు.

  • Loading...

More Telugu News